Description

బారతీయ స్వాతంత్ర్యపోరాటంలో ముస్లిం ప్రజల పాత్రను సవివిరంగా తెలిపే పుస్తకాలివి. నశీర్ అహమ్మద్ ఎంతో శ్రమకూర్చి ఈ పుస్తకాలకి అవసరమైన సమాచారాన్ని సేకరించారు. తెలుగు పాఠకులకి అందుబాటులో లేని చారిత్రక వివరాలను అందజేసారు. సయ్యద్ నశీర్ అహమ్మద్ రచనలు జాతీయ సమైక్యత - సమగ్రత, సామరస్యం పెంపొందించేలా ఆయన కలం సాగుతుంది.

వీరు ఎంతో పరిశోధన చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ముస్లిం సాహితీవేత్తల గురించి అమోఘమైన పుస్తకం వెలువరించారు.

వీటిని నేడే మీ సొంతం చేసుకోండి. మరుగున పడిన చారిత్రక అంశాలను, వ్యక్తులను తెలుసుకోండి.

* * *

సయ్యద్ నశీర్ అహమ్మద్ 22 డిసెంబరు 1955న నెల్లూరు జిల్లా పురుణి గ్రామంలో జన్మించారు. తల్లి సయ్యద్ బీబీజాన్, తండ్రి సయ్యద్ మీరా మొహిద్దీన్. పురుణిలో ప్రాథమిక విద్య తరువాత, కావలి, నరసరావుపేట, భోపాల్, చిత్రదుర్గ, గుంటూరులలో విద్యాభ్యాసం చేశారు.

1984లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 'ఉదయం' దినపత్రిక నరసరావుపేట విలేఖరిగా పనిచేస్తూ, పది సంవత్సరాల కాలంలో ఆ పత్రిక విజయవాడ ఎడిషన్ న్యూస్ కో-ఆర్డినేటర్ స్థాయికి ఎదిగారు. ఆ తరువాత, 'సిటీకేబుల్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్' (విజయవాడ)లో న్యూస్ - న్యాయ వ్యవహారాల సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత, 'వార్త' దినపత్రిక గుంటూరు న్యూస్ బ్యూరో ఇన్‌చార్జ్‌గా 2004 వరకు పనిచేసారు.

సమాజాన్ని అధ్యయనం చేయడం ద్వారా పరిశీలనా దృష్టిని, సేవాభావాన్ని అలవర్చుకున్న ఆయన విద్యార్థి దశ నుండి పలు సాంఘిక, సాహితీ, సేవాసంస్థల కార్యక్రమాలలో భాగస్వాములయ్యారు. సామాజిక కార్యకర్తగా అంధ విద్యార్థుల, వికలాంగుల, కుష్టురోగ పీడితుల సమస్యల పరిష్కారం కోసం, వారి ఆరోగ్యం-అభ్యున్నతికి కృషి చేస్తున్నారు.

గత మూడు దశాబ్దాలుగా నశీర్ రాసిన వ్యాసాలు, కవితలు, కథానికలు రాష్ట్రం లోని దాదాపు అన్ని పత్రికలలో చోటుచేసుకున్నాయి. భారత స్వాతంత్ర్యోద్యమంలో ముస్లింల పాత్రని వివరిస్తూ, తొమ్మిది ప్రామాణిక చరిత్ర గ్రంథాలను వెలువరించిన ఆయన చరిత్రకారుడిగా కూడా ప్రజలు, పండితుల ప్రశంసలందుకున్నారు.

భారత ముస్లిం జనసముదాయల సామాజిక - ఆర్ధిక-రాజకీయ స్థితిగతుల మీద విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలలో సభ్యునిగా పలు సభలు, సమావేశాలలో పాల్గొన్నారు. ఆయన మంచి వక్త మాత్రమే కాకుండా చిత్రకారుడు, కార్టూనిస్టుగా కూడా సుప్రసిద్ధుడు.

భారతదేశంలోని అన్ని సాంఘిక జనసముదాయాల మధ్య సద్భావన, సదవగాహన స్నేహం మరింత పటిష్టం కావాలనీ, సమాజంలో సామరస్యం, సుహృద్భావ వాతావరణం మరింతగా విలసిల్లాలని ఆకాంక్షించే సయ్యద్ నశీర్ అహమ్మద్ మానవతావాది. అన్ని రకాల అసమానతలు తొలగిపోవాలని కాంక్షించే లౌకిక ప్రజాస్వామ్యవాది.

Books currently available in this offer

No Results found for request