మీ కథల సంపుటిలోని కథలన్నీ జాగ్రత్తగా చదివాను. మీ కథనం, శైలి చాలా బాగున్నాయి. మీరు కథలు వ్రాయడం ఎలా అన్న వ్యాసంలో చెప్పినట్లు కథలు ఎలా పడితే అలా వ్రాయవచ్చు. నచ్చిన వారికి నచ్చుతాయి. నచ్చనివారికి నచ్చవు. అన్ని కథలు అందరికీ నచ్చేలా వ్రాయలేం. కథ వ్రాయడానికి ఏ సూత్రాలూ లేవు. ఉన్నా ఆ సూత్రాలు బద్దలు కొట్టి కథలు వ్రాస్తూనే ఉంటారు. అందుచేత ఏది కథ, ఏది కథ కాదు అన్నది చెప్పడం కష్టం.
మీ శైలి విలక్షణమైన శైలి. వాక్య నిర్మాణం చాలా బాగుంది. తమాషాగా ఉంది. ఉదాహరణకు ఆలోచన ట్రెయిన్లో
మీరు అబ్బాయి అనుకోండి....
నేను అబ్బాయి అనుకోండి. పాకెట్లో మనా దాచొచ్చు.
నేను అమ్మాయి అనుకోండి.... అన్న సంభాషణ చాలా తమాషాగ, కొత్తగా ఉంది.
అలాగే,
దాచేస్తే దాగని సత్యం ఆంధ్రపుత్రిక నేడు వంటరాని వనిత.
యవ్వనం ఒక అశాంతి వనం.
తల ప్రాణం ... తోక లేకపోవడం వలన ఎక్కడికి వెళ్ళాలో తెలియక కొట్టుమిట్టాడుతోంది.
ఒంటరి జీవితంలో వెళ్ళిపోయిన వెన్నె నీడలే కాని పడుతున్న వెన్నెల సోనలు లేవు.
లాంటి వాక్యాలు చాలా బాగున్నాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అన్ని కథల్లోనూ మీ వాక్య నిర్మాణం అద్భుతంగా ఉంది.
మీ కథల్లో యవ్వనం చేసే అల్లర్లు గిలిగింతలు పెట్టేలా ఉన్నాయి. నేను హాస్యం కథలు వ్రాస్తాను కాబట్టి, హాస్యం అంటే ఇష్టబడతాను కాబట్టి, మీరు కూడా ప్రతీ కథలోనూ ఎక్కడో అక్కడ హాస్య సంభాషణలు చొప్పించారు కాబట్టి నాకు అన్ని కథలూ ఇష్టమే కాని ఐసిసియు కథ చాలా నచ్చింది. ఇల్లాంటి కథలు మీలాంటి డాక్టర్లు మాత్రమే వ్రాయగలరు. గోడ గడియారం కథ చెప్పడం చాలా బాగుంది.
సాహిత్యం మీద మీరు వ్రాసిన కథలు సాహిత్యం, కథ, కవిగారి కళత్రం, హంతకుడి కథ, కథకుడి కథలాంటి కథలలో రచయితల మీద, విమర్శకుల మీద మీరు వేసిన బాణాలు చాశాక మీ కథల గురించి ఏమైనా వ్యాఖ్యానించడానికి సాహసం కావాలి. శాయి గారు అన్నట్లు మీరు వాకింగ్ ఎన్సైక్లోపేడియా. నేను తెలుగులో కాని, ఇంగ్లీషులో కాని ఎక్కువ సాహిత్యం చదవలేదు. నేను రావిశాస్త్రి, కారా మేష్టారు, ముళ్ళపూడి వెంకటరమణ, ఇగ్లీషులో పి.జి. వోడ్ హౌస్ చదివాను. దాదాపు వారి ప్రతీ రచన చదివాను. చదివిందే మళ్ళీ మళ్లీ చదివే వాడిని. నా మీద వీరి రచనలు ప్రభావం చాలా ఉంది. చెదురు మదురూ ఇతర రచయితల్ని చదివినా పెద్దగా సాహిత్యం చదవలేదనే చెప్పాలి. అల్లాంటి నేను మీ కథల మీద ఏ కామెంటు చేసినా హాస్యాస్పదంగా ఉంటుంది. అయినా మీరు నిర్మొహమాటంగా చెప్పమని అన్నారు కాబట్టి నా దృష్టికి వచ్చిన ఒక విషయం గురించి చెబుతాను.
మీ కథలన్నింటిలోనూ పాత్రలన్నింటిలోనూ శ్యాం కనుపిస్తాడు. రచయిత పాత్రల వెనక దాగుని ఉండడం జరుగుతూనే ఉంటుంది. కొన్ని కథల్లో శ్యాం పాత్రని డామినేట్ చేస్తున్నాడనిపిస్తుంది.
ఉదాహరణకు ఇది మా కథలో మీ గొంతు అన్ని పాత్రల గొంతులోనూ వినిపిస్తుంది.
నాన్న – దిగిరాను, దిగిరాను, దివినుండి భువికి...
అమ్మ – ఒక దోసెడు సానుభూతీ, ఒక బారెడు తీరు బాటూ
అన్న – శ్రీ అంటే సిరి... శ్రీ అంటే విషం.
తమ్ముడు – కన్నె కాటుక కళ్ళ కోకిలమ్మ పెళ్ళే..
సముద్రముల పడిపోవడమా? ఉరి పోసుకు చనిపోవడమా?
చెల్లెలు – బహుశా సినిమా పాట అనుకుంటా - ఆ పాలపుంత కౌగిలిలో
ఆ ఇంట్లో అందరికీ విపరీతంగా సాహిత్యాభిమానం ఉందనుకున్నా, అవి రచయిత మాట్లాడుతున్నట్లుగానే ఉంది కాని పాత్రలు మాట్లాడుతున్నట్లు లేదు.
నాకు నచ్చని మరో విషయం ఏమిటంటే మీరు ఇంత గొప్ప కథలు వ్రాసి, సడెన్గా ఆపేశారు. మీరు ఆపకుండా మళ్ళీ కలం పట్టి హుషారుగా రచనలు చెయ్యాలని నా కోరిక. వయసు, అనుభవం తోటి మీ కలం మంచి ఐసిసియు లాంటి మరిన్ని గొప్ప కథలు రావాలి.
-- తోలేటి జగన్మోహనరావు.
