హాలికులైననేమి? అన్నాడు కవి. ఆల్కహాలికులైననేమి? అన్నాడు ఆధునిక కవి. విన్నాడు భవదీయుడు ........"ఇది మా కథ" లోని వాక్యము. ఇలాంటి పదాలతో వాక్యాలు ఎవరికి సాధ్యం? నా ఉద్దేశ్యంలో మెడికో శ్యాంకే. అలనాటి పోతనను, ఆనాటి అన్నమాచార్యను ఈనాటి వచనంతో తలపించే నవ పద బంధాల కర్త మెడికో శ్యాం.
గత శతాబ్దంలో డెబ్బయ్ దశకంలో వ్రాసిన కథలు, ఈ శతాబ్దం ప్రథమ దశాబ్దాంతంలో ప్రచురించిన "శ్యాంయానా మెడికో శ్యాం కథలు" చదువుతుంటే ఏదో అనుభూతి, ఏదో ఆహ్లాదం. నీరు దొరక్క, పల్నాటి సీమలో శ్రీనాథుడు చాటువు చెప్పిన వెంటనే శివుడు విడిచిన గంగ ముంగిటికి వస్తే ఎలాంటి అనుభూతి వస్తుందో అలాంటి అనుభూతి ఈ పుస్తకం చదివితే అని నా అభిప్రాయం.
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో యం. డి. చేసిన లబ్ధ ప్రతిష్టులు కోకొల్లలు కాకపోయిన 'వె'కొల్లలు ఉండవచ్చు. (డాక్టర్. శ్యాం లాగ)
కాని, ఇలాంటి కథలు వ్రాసే మెడికో శ్యాం మాత్రం రేరెస్ట్ ఆఫ్ రేరే.
శ్యాం ఈ మధ్య కథలు వ్రాయడం లేదు............. ఎందుకో?
అర్థాపేక్ష, కీర్తి కాంక్షలు లభించాక వ్రాయడం మానేసాడేమో!
లేదా, తన మాటల్లోనే "అర్థంకాని కనపడని 'ప్రయోజనం' వలన కలిగిన అనాసక్తత" కూడా కారణం ఏమో!
"తేడా" చదివితే మెడికో శ్యాంకు మిగిలిన కథకులకూ మధ్య తేడా తెలుస్తుంది.
"భార్యాటికుడు" ఎవరో అని తెలుసుకోవాలి అంటే "కవిగారి కళత్రం" చదవాలిసిందే.
"గీత" కు కొత్త పర్యాయ "పదం" చెప్పిన ఘనత మెడికో శ్యాందే.
కథకు ఏదీ అనర్హం కాదు అంటూ తెలిపేదే "లీవ్ ఇట్"
ఒక్కొక్క కథ ఒక్కొక్క ఆణిముత్యం ఇప్పుడు నాకు ఒక్కటే దిగులు. ఇలాంటి కథకుడు కథలు వ్రాయక "గాలి మేడల అమెరికాలో" ఏమి చేస్తున్నట్టో.
-- వింకో సంపత్
