కాఫ్కా బయోగ్రఫీ తెలిసిందే కనుక దాని గురించి ప్రస్థావించడం లేదు. కానీ అతను భౌతికంగా ఎక్కువ బలంకలవాడు కానందున అతను తండ్రి చేత వ్యంగ్యపు మాటలు వినడానికి అలవాటు పడి ఉండి తన్ని తాను సంకెళ్ళతో ( తన రచనలతో) బంధించుకున్న కాఫ్కాకి ఉండే అభద్రతాభావం మాత్రం ఈ పుస్తకంలో ప్రతిఫలిస్తుంది.
ఒక ఉదయాన్నే తన 30 వ పుట్టినరోజున తను అద్దెకి ఉన్న గదిలోనే అరెస్ట్ అయిన కె అని మొత్తం పుస్తకంలో పిలవబడిన కె జోసెఫ్ కథ ఇది. ఎందుకు అరెస్ట్ అయేడో మనకి కూడా వివరించబడదు. అతనికీ తెలియదు. మొదట ధీమాగా ఉన్నప్పటికీ రానురాను అతను దీన్ని వల్ల ఎదురయిన మానసిన ఒత్తిడికి లోబడతాడు. పుస్తకమంతటా కె అటకలమీద ఉండే నిరంకుశమైన, గోప్యమైన న్యాయస్థానాలకి విరుద్ధంగా- నిరర్థకంగా సంఘర్షణ పడుతూనే ఉంటాడు. చోట్లూ పాత్రలూ దీన్లో అనిర్ణీతంగా వదిలివేయబడతాయి.
న్యాయస్థానాల దారుణమైన మనస్సృష్టి, నిరంకుశాధికారం “న్యాయవిచాణ” పుస్తకంలో స్పష్టంగా కనపడతాయి. పుస్తకం చదివితే అప్పుడు ఐరోపాలో ఉన్న న్యాయస్థితికీ ప్రస్తుతం మన దేశంలో ఉన్న న్యాయస్థితికీ అంతగా తేడా ఏదీ లేదనిపిస్తుంది. సంవత్సరాలుగా ఒకే కేస్ -నేరమేదో స్పష్టంగా తెలియకుండా కూడా దాని విచారణ సాగుతూనే ఉంటుంది. కె ప్రవేశించిన అనేకమైన భవనాల గదుల వెనక ద్వారాలు అటక న్యాయస్థానాలకే దారి తీస్తాయి. ఎవరి కేసూ గుప్తంగా ఉండదు. కె కేసు గురించి మొత్తం పట్టణానికి తెలిసినట్టనిపిస్తుంది. తర్క విరుద్ధమైన న్యాయాత్మక పద్ధతి మనకి కాఫ్కా పుస్తకంలో కనపరచబడుతుంది.
వివరించబడనివీ, అస్పష్టంగా దృశ్యీకరించబడినవీ కొన్ని ఉన్నాయి. చిన్న న్యాయస్థానాల యొక్క న్యాయాధిపతులు తమ చిత్రాలని దర్జాగా కనపడేలా చిత్రింపబడచేసుకుంటూ ఉంటారు. కె తన స్నేహితురాలైన ఎలీజా ఫోటోని తన వాలెట్లో పెట్టుకున్న ఒక మాట తప్ప ఎలిజాకి ఇంక పుస్తకంలో ఇంకెక్కడా చోటు ఉండదు. అతను న్యాయవిచారణకి సంబంధంగా కలుసుకునే ప్రతి స్త్రీ పట్ల అతను పెంపొందించుకునే లైంగిక ఇచ్ఛ మానవసమాజంలో ఉన్న ముఖ్యమైన అపరాధం/సిగ్గుకి మూలాధారం. ప్రభుత్వానికి వ్యక్తి మీద ఉన్న ఏకాధిపత్యం ఎవరికీ జవాబుదారీ కాదు. అది అధికారతావాదం మాత్రమే. అధికారం కొంతమంది చేతుల్లోనే ఉంటుంది. ఒకే ఒక వ్యక్తి అనిర్ణీతమైన చట్టానికి విరుద్ధంగా చేసిన పోరాటం ఈ పుస్తకం. కె పడే సంఘర్షణ అంతర్గతమైనది కనుక కె మనోభావాలు వ్యతిరిక్తమైవన్నట్టుగా కనిపిస్తుంది. కె కోరే స్వేచ్ఛ తననుండి తనే విమోచింపబడటం.
బాంక్ యొక్క ఇటాలియన్ కస్టమర్ని కలుసుకునేటందుకు కేథెడ్రెల్కి వెళ్ళిన కె ని వెనక్కి పిలిచిన యాజకుడు కూడా కారాగార యాజకుడే అయి ఉంటాడు. కె అతన్ని సహాయం అడుగుతాడు కాని అతను ఒక సెర్మన్ మాత్రం ఇచ్చి సహాయం చేయడానికి నిరాకరిస్తాడు. సరిగ్గా ఒక సంవత్సరం తరువాత కె 31 వ పుట్టినరోజున అతన్ని ఇద్దరు ఊరికి దూరంగా ఉన్న ఒక రాతిగనికి తీసుకు వెళ్ళి గుండెల్లో పొడిచి చంపేస్తారు. ప్రారంభంలో తనకి కలిగిన అపకీర్తిని తొలిగించుకునేటందుకు మరియు న్యాయం పొందేటందుకు తన బాంక్ పనిని నిర్లక్ష్యపెట్టి, ప్రతీ అటక వకీలు వద్దకీ, న్యాయస్థానపు చిత్రకారుని వద్దకీ కూడా వెళ్ళే కె ఆలోచనాశక్తీ విచక్షణా అప్పటికే క్షీణించి ఉన్నందువల్ల విరోధించే తన ప్రేరణని అతను అప్పటికే కోల్పోయి ఉంటాడు.
కాఫ్కా యొక్క అనేకమైన చిత్రీకరణలలాగే కె జీవితం కూడా ఏ ఆశా మిగిలి లేకుండా అభావంగా అంతం అవుతుంది.
