పుస్తకం: శేషేంద్ర
February 6, 2011 by
“నేనింతా ఒక పిడికెడు మట్టే కావచ్చు, కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది.” – అని గర్జించిన గుంటూరు శేషేంద్ర శర్మ పరిచయం అవసరం లేని కవి. శేషేంద్ర శర్మ ను విప్లవకవి అనో, ఇజాల కవి అనో, వాదాల మరియూ నినాదాల కవి అనో ఒకగాటన కట్టేయలేం. ఆయన కవితల ద్వారా ఆయనేమిటో ఒక్క మాటలో చెప్పడం దుర్లభమేకానీ, ఒక్కమాటలోఆయనేమి కాదో మాత్రం తప్పకుండా చెప్పవచ్చు. ఆయన అకవి కాదు, కుకవి కాదు. ఆయనెప్పుడు గొంతెత్తినా, వ్యథాపదఘట్టనల క్రింద శతాబ్దాల తరబడి నలిగిన మనిషి గొంతే వినిపిస్తుంది. ఛందోబద్ధ పద్యం వ్రాసినా, పదకవిత వ్రాసినా, వచనం వ్రాసినా కవిత్వం తొణికిసలాడుతుంది.
ఈయన కలం నుంచి వివిధ కాలాల్లో వెలువడిన పక్షులు అనే పద్యకావ్యం, సముద్రం నాపేరు అనే వచనకవితా సంపుటి, ఈ నగరం జాబిల్లి అనే గజల్ లక్షణాలను తెలిపే గీతికావ్యం లను ఒకటిచేసి, “శేషేంద్ర” అనే పేరుతో శేషేంద్ర మెమోరియల్ ట్రస్టు వారు ఒక చిన్న, అందమైన పుస్తకం గా ప్రచురించారు. ప్రతులు అన్ని విశాలాంధ్ర, నవోదయ, నవయుగ పుస్తక దుకాణాల్లో లభిస్తాయి. పుస్తకం ముఖపత్రం మీద శ్రీకృష్ణదేవరాయల వేషం లో చిద్విలాసంగా, ఠీవిగా కూర్చున్న శేషేంద్ర చిత్రం ఆకర్షణీయంగా ఉంటుంది.
ప్రముఖ పాత్రికేయులు ఎ.బి.కె.ప్రసాద్ గారు వ్రాసిన “శిథిల జీవుల కోసం శిరస్సు ఎత్తిన కవితా శివుడు శేషేంద్ర!” అన్న శీర్షికన వ్రాసిన ముందుమాటతో పుస్తకం ప్రారంభం అవుతుంది. శేషేంద్ర సాహిత్యం తో ఇంతకు మునుపు పరిచయం లేని వారు మొదటగా ఈ ముందుమాట తో ప్రారంభించవచ్చు. మూడుపేజీల నిడివిలో ప్రసాద్ గారు శేషేంద్ర గారి బహుముఖప్రజ్ఞత్వాన్ని మనకు చూచాయగా పరిచయం చేస్తారు.
తరువాత వచ్చే శబ్దాలు-శతాబ్దాలు అనే ఒక సుధీర్ఘకవిత ఒక కావ్యాత్మక కథనం. శేషేంద్ర ఉత్తమ పురుషలో ఈ కథనాన్ని నడిపిస్తాడు. వివిధ దశాబ్దాలు, శతాబ్దాలు ఎడంగా వివిధ దేశాల్లో జన్మించిన మహనీయుల్ని తన అద్భుతమైన కల్పనలో సమకాలీనులను చేసి, ఆయా వ్యక్తులు తమ తమ జీవితకాలాల్లోనూ, రచనల్లోనూ వ్యక్తపచిన భావాలను మరలా వారి చేత చెప్పిస్తాడు శేషేంద్ర. తన కథానికలో వారే పాత్రలు, వారి వారి అభిప్రాయాలే వారి సంభాషణలు, వీటన్నిటీ సమన్వయపరచినట్టు గా చేస్తూ, తను చెప్పదలచుకున్న విషయాన్ని రప్పిస్తాడు శేషేంద్ర. ఇలాంటి మహత్తరమైన పని, అదీ కవితాత్మకంగా చేయడం చదువరులను అబ్బురపరస్తుంది. కాళిదాసు, భవభూతి, టి.యస్.ఎలియట్, వేమన, వాల్మీకి, బొదిలెర్. రేంబో, శీశ్రీ, ప్లేటో ఇలాంటి వారందరూ ఒకరితోనొకరు సమాలోచలు చేసుకుంటుంటే, దానిని శేషేంద్ర లాంటి కవి అక్షరీకరిస్తే పండగే మరి!! [pullquote]కాళిదాసు, భవభూతి, టి.యస్.ఎలియట్, వేమన, వాల్మీకి, బొదిలెర్. రేంబో, శీశ్రీ, ప్లేటో ఇలాంటి వారందరూ ఒకరితోనొకరు సమాలోచలు చేసుకుంటుంటే, దానిని శేషేంద్ర లాంటి కవి అక్షరీకరిస్తే పండగే మరి!![/pullquote]
శేషేంద్ర “పద్యం” అన్న పదాన్ని విస్తృత అర్థం లో వాడతారు. ఛందోబద్ధమైన పద్యాలూ ఆయనకు పద్యాలే, పద కవితలూ పద్యాలే. సరిగ్గా అలాంటి పదకవితలు, ఛందోబద్ధ పద్యాల సంకలనమేపక్షులు అన్న పద్యకావ్యం. ఈ పద్యాల్లో శేషేంద్ర తన గుండె భాష మాట్లాడతాడు. “చెరకు విల్లు విరిచినవాడే చిగురుకైత చెబుతాడు” “జీవితంలో లేని కవిత కాగింలో వస్తుందా/తునక మబ్బులేకుండా చినుకు నేల పడుతుందా” అంటూ కవులగూర్చి చెబుతాడు. “పిలుపులో నీ కంటి మలుపులో ఉందో/తలపులో జాబిల్లి తెలుపులో ఉందో/ ఎక్కడుందో వపు యెలా వచ్చిందో” అనే భావుకత్వాన్ని ప్రదర్శిస్తాడు. “కులగోత్రమ్ములు లేవు మాకు, ధనిక క్రూర క్రియా పీడిత జ్వలిత ప్రాణీ చమూ సమూహమొకటే” – అని శ్రామికుల పక్షాన నిలబడి హూంకరిస్తాడు. “ఎందుకురాదు విశ్వజగతీ మహతీ శతకోటి త్ంత్రులై ముందుకు పోవు రోజు” అని నిగ్గదీస్తాడు. ఈ పద్యకావ్యం లో శేషేంద్ర లోని భావుకత, పదచిత్రణా వైచిత్రి, భావగాంభీర్యం, అల్వోకగా పదాతో ఆడుకునే తీరు ఇవన్నీ కనిపిస్తాయి.
“సముద్రం నా పేరు” అనే వచనకవితా సంఫుటిలో శేషేంద్ర లోని విప్లవకారుడు పదాలతో భావాలతో, ప్రతీకలతో విశ్వరూపం చూపిస్తాడు. పదాల్లో వ్యక్తీకరించలేని ఒక బలమైన భావం యొక్క అభివ్యక్తికై ఒక ప్రతిభావంతుడు పడే తపన కనిపిస్తుంది ఈ కవిత ఆసాంతం. “సముద్రమంటే నీఖేం తెలుసు?” అని మొలుపెట్టి “సముద్రాలెక్కడ ఆకాశాల్ని పిడికిళ్లతో పొడుస్తాయో అక్కడికే పోతాను; తుఫానులతో నే స్నేహం చేస్తాను…” అంటాడు. బాగా గుర్తుండిపోయే మాటలు – “నీ బాణానికి గురి ఎవడో శత్రువు, నా భాణానికి గురి ఏదో హృదయం; గాలివాలు తెలిసి ఎగిరే పక్షివి నీవు గాలి కూడా భయపడే గమ్యం కోసం రగిలే పక్షిని నేను-” అన్నవి. ఇలా గాలి కూడా భయపడే గమ్యం కోసం రగిలే పక్షులే ఇలాగ వ్రాయగలరేమో అనిపిస్తుంది. ఒకక్షణం అంతులేని కరుణను ఒలికించి, మరుక్షణం తుఫానులా చెలరేగుతూ తన భావాల అలలపై చదువరులతో సర్ఫింగ్ చేయించటం లో శేషేంద్ర దిట్ట.
“ఈ నగరం జాబిల్లి” గజల్ లక్షణాలను తెలిపే గీతికావ్యం, గజల్ పూర్వాపరా విశ్లేషణలను చేసే వ్యాసాల సంకలనం.
“నేను జేబులలో కోకిలలు వేసుకుని రాలేదు.
పిడికిళ్ళలో బాంబులతో వచ్చాను.
నేను మోకరించి ప్రార్థిస్తున్నాను
ఓ జిందగీ నన్ను
సుఖం మీద శిలువ వేయకు”
అని అందంగా, అర్థవంతంగా చురుక్కుమనేట్టు ఆంధ్రజ్యోతి వీక్లీలో లో శేషేంద్ర తన తెలుగు గజళ్ళన ఎనభయ్యవదశకం లో ప్రకటించారట. వాటి సంకలనం, గజళ్ళను గూర్చిన వ్యాసాలు “ఈ నగరం జాబిల్లి”.
ఈ పుస్తం చదవడం పాఠకులకు ఒక మంచి అనుభూతిగా మిగిలిపోగలదు. దీని వెల వందరూపాయలు. ప్రతుల కోసం అన్ని ప్రముఖ పుస్తక దుకాణాల్లోనూ చూడండి.