అదిగో నవలోకం !
వెలిసే మనకోసం !!
ఆధునిక జీవితాన్ని చిత్రీకరించాలంటే కథానికకు మించిన ప్రక్రియ సాహిత్యంలో మరొకటి లేదు. వేగవంతమైన ఈనాటి జీవితంలో దృశ్యాలు తప్ప దుఖాలు లేవు. దృశ్యాలను విశ్లేశించుకునే సమయమూ, తీరుబడీ కూడా లేవు. "చూసేశాం ! అయిపోయింది" అనుకోవడమేగాని ఆత్మశోధనలు, అంతరంగ పరిశోధనలూ కనిపించవు గాక కనిపించవు.
_ ఈ విశయాలను బాగా ఆకళింపు చేసుకున్నాడు అనిసెట్టి శ్రీధర్. దృశ్యాలు దృశ్యాలుగా కథలను పేర్చి "కొత్త బంగారులోకం" అని పేరు పెట్టి చేతులు కట్టుకుని పాఠకుల ముందు ఒద్దిగ్గా నిలుచున్నాడు. ఈ కథల్లో హైబ్రిడ్ కథనం లేదు. అర్థం లేని వ్యాఖ్యానాలు లేవు. చక్కని శైలి ఉంది. హాయిగా చదివించే తెలుగు _ తెలివీ ఉన్నాయి. కథ చదువుతుంటే ఊపిరి ఆడకపోవడం, ఆయాసపడడంలాంటి ఇబ్బందులు లేవు. "అమ్మో" అనుకునేంత భయాలూ లేవు. అయితే చిత్రంగా పాఠకునికి లేని దుఖాలూ, బాధలూ రచయితకి ఉన్నాయి. ఉండబట్టే "స్పృహ", "పాత సామాను" లాంటి కథలు రాసి "నిరంతర అంతర్, బహిర్ యుద్ధారావమే తన రచనా వ్యాసంగం" అని తెలియజేశాడు.
సంకలనంలో మొత్తం పదిహేను కథలున్నాయి. ఈ కథలన్నీ బాగున్నాయి. ఎంత బాగున్నాయంటే కథల్లో కథలనిపించే "స్టోరీ బైట్స్" కూడా కళ్ళని కట్టిపడేస్తాయి.
* తప్పు చేసి చెయ్యి జాపి మేస్టారి చేతిలో బెత్తం దెబ్బలు తిన్నాను కానీ తప్పు చెయ్యడానికి ఏనాడూ నేను చెయ్యి చాపలేదు (మద్దతు)
* బలహీనవర్గాల కోసం అంతే బలహీనంగా ఇళ్ళు కడతాడని ఆయన మీదో జోక్ ఉంది (నెత్తురు కూడు)
* మేం రెక్కల్లేని పక్షులం
మేం బావిలో కప్పలం
మేం బోన్ సాయ్ మొక్కలం
మేం గోడకు వేలాడే బూజులం
మేం తీవెలేని వీణలం
మేం తావిలేని పూవులం (కొలంబస్)
- పరమాణువు పరితాపాలను తెలుసుకున్నట్టున్న శ్రీధర్ కథను చెప్పడానికి పేజీలు, పేజీలు అఖ్క ర్లేదంటూ ఒకటి రెండు వాక్యాల తోనే కథంతా చెప్పగలగడం అత్యాధునిక శిల్పానికి శ్రీకారం చుట్టడమనిపిస్తోంది. అందుకు ఉదాహరణ: కోళ్ళ ఫారంలో శాశ్వతంగా పనిచేసేదెవరో అర్థమయింది విశాలికి. కేజెస్ లో ఉన్న కోళ్ళకు తమకు స్వాతంత్ర్యం లేదన్న స్పృహ కూడా లేదేమో అన్న లీల మాటలు గుర్తుకు వచ్చాయి. మరి లీలకు? (స్పృహ)
- ఈ రకంగా అనిసెట్టి శ్రీధర్ కథలు ఆలోచింపచేయడమే కాదు, మనల్ని ప్రశ్నిస్తాయి. జవాబులు వెతుక్కోమంటాయి. జవాబులు తెలిస్తే కథే వేరు. మరి ఆలస్యం దేనికి, చదవండి.
- జగన్నాధ శర్మ (Andhra Jyothy review)
