ప్రధానమంత్రిని కిడ్నాప్ చేశారా! ఇరవై నాలుగు గంటలూ కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్యన తిరుగాడే ప్రధానమంత్రిని మాయం చేయటం ఎలా సాధ్యం? ఏం చేస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది??
షాడో మనస్సులోని మాటలు బయటికి రాకముందే, గది తలుపుల్ని ఓరగా తెరిచి, "సర్..... హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారు." అని ఎనౌన్స్ చేసింది సులోచన.
ఆమె మాటలు ముగియక ముందే గదిలోకి వచ్చి, ఒక కుర్చీలో కూర్చున్నారు హోమ్ మినిస్టర్. విపరీతమైన ఆందోళన కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది ఆయన వదనంలో.
"రాజూ..... ఎందుకు జరిగింది _ ఎలా జరిగింది అనే ప్రశ్నలు యిప్పుడు వద్దు. మాయమైన ప్రధానమంత్రిని వెంటనే తిరిగి రాజధానికి తీసుకురాకపోతే దేశంలో శాంతి భద్రతలు సర్వనాశనం అయిపోతాయి. ఈ పని సి.ఐ.బి. ద్వారానే జరగాలనని మన నాయకులు అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారు..... బై హుక్ ఆర్ క్రుక్ ప్రధానమంత్రిని సురక్షితంగా రాజధానికి చేర్చాలి.... ఈ విషయాన్ని చెప్పుటానికే నేను వచ్చాను." అన్నారాయన మాటల్ని తూచి తూచి వాడుతూ.
