-
-
వీరనారి ఝాన్సీ ఝల్కారీబాయి
Viranari Jhansi Jhakaribai
Author: Mohandas Naimish Rai
Publisher: Hyderabad Book Trust
Pages: 25Language: Telugu
ఝాన్సీకి చెందిన ఝల్కారీబాయి ఒక దళిత వీర వనిత. గత అనేక శతాబ్దాలుగా బుందేల్ ఖండ్ (ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం) లో ప్రజలు ఆమె గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కానీ ఆమె పేరు ఇంతవరకూ చరిత్ర పుటల్లో మాత్రం స్థానం సంపాదించుకోలేకపోయింది. ఆమె చరిత్రను దళిత రచయితలే అతి కష్టం మీద కాపాడుకుంటూ వస్తున్నారు. ఆమె జీవితాన్ని, ప్రత్యేకించి ఆమె మారువేషంలో ఈస్టిండియా కంపెనీ సైన్యంతో చేసిన పోరాటాన్ని బుందేల్ ఖండ్‌లో జానపద గీతాలుగా ప్రాచుర్యంలో వున్నాయి. ఆమె ధైర్య సాహసాలు, దళిత అస్తిత్వం ఉత్తర భారత దేశంలో దళితుల సాంస్కృతిక ఐక్యతకు దోహదం చేస్తూ గొప్ప స్ఫూర్తి నిస్తున్నాయి.
ఇవాళ ఇతర దళిత కులాలలో మాదిరిగానే కోరిస్ కులం వారు కూడా ఝల్కారీబాయిని తమ కులదేవతగా కొలుస్తున్నారు. తమ స్వాభిమానాన్ని, తమ కుల ప్రతిష్టను పెంపొందించుకునేందుకు వారు ప్రతి సంవత్సరం ఝల్కారీబాయి జయంతిని వేడుకగా జరుపుకుంటున్నారు. ఆమె కోరిస్ కులంలో పుట్టిన దళిత వీరాంగణ కావడం గర్వకారణంగా భావిస్తున్నారు. అందుకే ఆమె వీరోచిత పోరాటాన్ని గానం చేసేటప్పుడు వారు ఈ అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంటారని సుప్రసిద్ధ విద్యావేత్త బద్రీనారాయణ్ అంటారు.
వివిధ దళిత సంస్థలు ప్రతి యేటా ఝల్కారీబాయి వర్థంతిని 'షహీద్ దివస్' (మృతవీరుల సంస్మరణ దినం) గా జరుపుతున్నాయి. గ్వాలియర్‌లో ఆమె పేరిట ఝల్కారీబాయి బాలికల కళాశాల కూడా వుంది. 2001 జులైలో భారత ప్రభుత్వ తపాలా శాఖ, ఆమె స్మారకార్థం నాలుగు రూపాయల పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. 2010లో నీలి జెండా పత్రికలో ఈ పుస్తకం సీరియల్‌గా వచ్చింది.
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ గతంలో అయ్యంకాళీ, పండిత్ అయోతీదాస్, కొమురం భీం వంటి విస్మృత దళిత కథానాయకుల జీవిత చరిత్రలను ప్రచురించింది. ఆ పరంపరలో భాగంగా ఇప్పుడు ఈ ఝల్కారీబాయి జీవిత గాథను సగర్వంగా సమర్పిస్తోంది.
