-
-
కొమ్మ కొమ్మకో సన్నాయి
Komma Kommako Sannayi
Author: Dr. Veturi Sundara Ramamurthy
Publisher: Veturi Sahiti Samithi
Pages: 213Language: Telugu
తన ఆప్తులు, అభిమానులు ఒక్కొక్కరూ తెరమరుగవుతున్నప్పుడు... గాయపడిన కవి గుండెను తాకిన ఆర్ద్రస్మృతుల అక్షరాకృతులే ప్రధానంగా ఈ 'కొమ్మ కొమ్మకో సన్నాయి' వ్యాసాలు.
కె.వి. మహాదేవన్ స్వరకల్పనలో వేటూరి రచించిన 'కొమ్మ కొమ్మకో సన్నాయి - కోటిరాగాలు వున్నాయి' పాట ఆనాడు ప్రతినోటా పండింది. మామ కన్నుమూసినప్పుడు ఆయన మధురస్మృతులను ఆ పాటతో పల్లవించి 'గీతాంజలి'ని సమర్పించిన వేటూరి, ఆ శీర్షికతో మరికొందరు చిత్రరంగ ప్రముఖుల అంతరంగ చిత్రాలను వ్యాస రూపాలలో ఆవిష్కరించి 'కొమ్మ కొమ్మకో సన్నాయి'లు... వేటూరి సాహితీ మాధుర్యాన్ని వెలార్చే కోయిలలు... ఆత్రేయాది మనస్వుల ఆత్మీయుతాపరిమళాలు... మరెందరో పరిశ్రమకు చెందిన ప్రముఖులను సన్నిహితంగా సందర్శించి వేటూరి రాసిన అనుబంధ పత్రాలు - గీతాలు 'సుందర' చిత్రాలు.
అందమైన మకుటాలు పాఠకుల్ని ఆహ్వానించి వ్యాసాలలో తలదూర్చేలా చేస్తాయి. మామ మహాదేవన్ను స్మరిస్తూ రాసిన వ్యాసానికి 'గురుః బ్రహ్మ గురుర్విష్ణు...'ను అనుసరిస్తూ - 'స్వరబ్రహ్మ రాగ విష్ణు ! గురుర్దేవో మహాదేవన్' అనే మకుటాన్ని పెట్టడం వేటూరి స్టయిల్ ! అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డా. కొంగర జగ్గయ్యగారి జ్ఞాపకాలతో రాసిన వ్యాస మకుటం - 'నాటి ఆకాశ వాణి, నేటి అశరీర వాణి'లో జగ్గయ్యగారి మూలసత్త్వమైన గళస్ఫూర్తి, వేటూరివారి కలం విస్ఫూర్తి రెండూ గోచరిస్తాయి. మకుటాల మత్తు నుంచి తేరుకోకుండానే పాఠకులకు, 'పాటలీ పుత్రం', 'రాగ తాళీయం', 'గీతావరణం', 'జంధ్యావందనం', 'పిబరే హ్యూమరసం', 'స్వరమేశ్వరుడు' వంటి పద ప్రయోగాలు, శబ్ద చిత్రాలు చక్కిలిగింతలు పెడతాయి. పాటలలోనేకాదు - వచన రచనలోనూ ప్రాసక్రీడలాడ్డం వేటూరి వారికి 'పెన్ను'తో పెట్టిన విద్య అని వ్యాసాలన్నీ రుజువు చేస్తాయి. జంధ్యాల అకాల మరణానికి చింతిస్తూ ... 'ఆయన జీవితం ఎంత చిన్నదైనా అది కలకాలం మను చరిత్ర. ఆ మనుచరిత్ర కృతి భర్త వెళ్లిపోతే...' అని రాయడం మన కన్నీళ్లనే కాదు, కళ్లలో మెరుపుల్నీ ఆపలేదు!
సినిమారంగంలో అనుబంధాలకు మాననీయ సంబంధాలకు తావు లేదనీ, అక్కడంతా 'కప్ అండ్ లిప్' పద్ధతి అనీ అంటుంటారు. దానికి విరుద్ధంగా వేటూరి పాటల రచయితగా తన ఎదుగుదలకు పునాదులను వేసిన గురువులను విస్మరించకపోవడం, అలనాటి తప్పటడుగులను ఇంత ఎదిగిన తర్వాత కూడా నిజాయితీగా వివరించడం... ఆ వినయ భారం, హృదయ సంస్కారం నిజంగా ఆశ్చర్యకరం.
ఈ 'కొమ్మ కొమ్మకో సన్నాయి'ని పరిచయం చేసే అవకాశాన్ని 'దొరకునా ఇటువంటి సేవ' అంటూ వినియోగించుకున్నాను.
- డాక్టర్ పి.యస్.రెడ్డి (పైడిపాల)
Chala manchi pustakam.