-
-
అంబేద్కర్ ది ట్రూ పేట్రియాట్ - అంబేద్కరిజం ది ట్రూ పేట్రియాటిజం
Ambedkar the True Patriot
Author: Sekhar and Yadagiri
Publisher: Samatha Sainikdal Publications
Pages: 148Language: Telugu
“కులవ్యవస్థ వంటి భ్రష్టవ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా కన్పించదు. ప్రజలను జీవచ్ఛవాలుగా, నిష్క్రియాశీలురుగా, పక్షవాత రోగులుగా, క్షతగాత్రులుగా ఎందుకూ పనికిరాని దద్ధమ్మలుగా తయారు చేసిన నికృష్ట నీచవ్యవస్థ ఇది. ఇందులో అతిశయోక్తి ఏమీలేదు. చరిత్రే దీనికి ప్రబల సాక్ష్యం”.
- (అంబే సం.1 పే.82)
“సాంఘిక హోదాకి సంబంధించి వివిధ కులాల మధ్య శత్రుత్వ భావనను కలుగజేయడం కులవ్యవస్థలోని మొదట విషయం. కులాల మధ్య విద్వేషపూరితమైన ఆరోహణాక్రమాన్ని, అవమానకరమైన అవరోహణా క్రమాన్ని కల్గించడం రెండవ విషయం.”
- (అంబే 3-4)
“కులవ్యవస్థ సమాజాన్ని ముక్కలు చెక్కలు చేసింది. ఇష్టమైన పనిచేయటాన్ని నిషేధించింది. శ్రమ నుంచి తెలివితేటల్ని వేరుచేసింది. విపత్కర సమయాల్లో ఒకే తాటిమీద సమాజం నిలబడేట్టు చేసే సమైక్య భావాన్ని అడ్డుకుంది.”
- (అంబే. సం.3 పే.79)
“అంటరానితనం ఎందువల్ల నశించిపోలేదు? అస్సృశ్యుల పట్ల జరిగే న్యాయరాహిత్యాన్ని హిందువులు సవ్యమూ, న్యాయబద్ధమూ అయిన విషయంగా ఎందుకు భావిస్తారు? హిందువులు అస్సృశ్యులతో వ్యవహరించే తీరులో అతని అంతరాత్మ పరితాపాన్ని అనుభవించకుండా ఎలా ఉండగలుగుతుంది? అంటే అస్సృశ్యులపై ఎంతటి క్రూరమైన పద్ధతినైనా అవలంభించడానికి వారికి హిందూమతం అనుమతి నిచ్చింది?”
- (అంబే సం.5. పే. 97,116)
“కులమూ, అస్సృశ్యత ఒకే వ్యవస్థలోనివే. సవర్ణ హిందువు అస్సృశ్యతను పాటించడానికి కారణం అతనికి కులం పట్ల గల గాఢ విశ్వాసమే. మతదృష్టి గల హిందువు కులవ్యవస్థ నిర్మూలనాన్ని ఎంత వ్యతిరేకిస్తాడో, అస్సృశ్యతా నిర్మూలనను కూడా అంతే వ్యతిరేకిస్తాడు”
- (అంబే సం.5. పే. 129, 130)
“కులవ్యవస్థను కొనసాగించేందుకు హిందూ సమాజం తనవంతు పాత్రను నిర్వర్తించినట్లే, ప్రభుత్వంలోని హిందూ ఉద్యోగులు కూడా తనువంతు పాత్ర నిర్వర్తిస్తున్నారు. ఈ రెండూ కలిసి పాతుకుపోయి ఉన్న వ్యవస్థను అభేద్యంగా తయారు చేస్తున్నాయి.”
- (అంబే సం. 5. పే. 138)
“కులవ్యవస్థలో బ్రాహ్మణుణ్ణి క్రింది స్థానానికి దించాలని శూద్రుడు ఆకాంక్షిస్తాడు. కాని అదే సమయంలో అస్సృశ్యుడు తన స్థాయికి ఎదగడాన్ని అతను నిరసిస్తాడు. అస్సృశ్యులతో చేతులు కలిపి వ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నించడాని కంటే అతడు బ్రాహ్మణుడు పెట్టే అవమానాలు భరించడానికే సిద్ధపడతాడు”.
- (అంబే. సం. 5. పే. 148)
“వివక్షత అనేది స్వాతంత్ర్యం లేకపోడానికి మరోపేరు”
- (అంబే. సం. 5. 141)
“స్వాతంత్ర్యం ఉపయోగపడనప్పుడు స్వతంత్రం రానట్టే లెక్క”
- (అంబే. సం. 3. పే. 112)
