-
-
వీరనాయకుడు
veeranayakudu
Author: Patanjali Sastry
Publisher: Chinuku Publications
Pages: 78Language: Telugu
వీరనాయకుడు ప్రశాంతంగా ఆలోచించాడు. నిజానికి కోరుకొండలో ఆలోచించిన పథకంలో ఈ స్థితిని అతను ఊహించలేదు. మహాదండనాయకులవారి ఆరోగ్యం, విశ్రాంతి ఆలోచించినంతగా ఆయన కుమారుడి గురించి పట్టించుకోనందుకు తనను తాను మనసారా తిట్టుకున్నాడు. ఇప్పుడు పరిస్థితి సున్నితంగా జటిలంగా తయారైంది. అన్న హితవు మందగించడం వల్ల మెల్లిగా లఘువుగా భోజనం కానిచ్చి, అలవాటు ప్రకారం రెండే ఆకుల తాంబూలంతో సరిపెట్టుకుని వీరనాయకుణ్ని పిలిపించారు పెద్దాయన. పక్క గదిలో తీవ్రాలోచనలో ఉన్న వీరనాయకుడు నాలుగంగల్లో దండనాయకుల వారి దగ్గిరికి వెళ్లేడు. వారసుని ప్రస్తావన వారింతవరకూ తేలేదు. కానీ అది ఏ క్షణంలో అయినా వినవలసి వస్తుందని నాయకుడికి తెలుసు. అది ఏకాంతంగా తన సమక్షంలోనే జరగాలని అతని కోరిక. అందుకే అధికారుల పరామర్శను కట్టడి చేశాడు వీరనాయకుడు. ఆయన మంచం పక్కనే ఆసనం మీద కూచున్నాడు నాయకుడు. మాట్లాడుతూనే నిద్రలోకి జారేడు దండ నాయకులవారు. కూచుని జాగ్రత్తగా అల్లిక మొదలుపెట్టేడు వీరనాయకుడు. అతని ముందున్న సమస్యని రెండు ముక్కలుగా విడగొట్టే డతను. ఒకటి వర్తమానం వెళ్లకుండా చెయ్యడం, పంపించినా ఆలస్యం చెయ్యడం. దండుదారిలో ఆశ్వికుల్ని వర్తమానాతో పంపించడం కొత్తగాదు. రెండు, దండనాయకుల వారి స్థానంలో ఎవరు? పోతారెడ్డివారే ఈ నిర్ణయం అతి స్వల్ప సమయంలోనే తీసుకోవాలి. సంప్రదాయంగా మహామంత్రి బ్రాహ్మ వర్గానికిచెందినవాడై ఉంటాడు. చాళుక్య ప్రభువుకి కుల పక్షపాతం లేదు. దండనాయకులవారు వెలమ నాయకులవారు. ఆయన అర్ధాంగి,పుట్టింటివారు కొలనువీడు వాస్తవ్యులు. వాస్తవానికి రాజధానిలో రాజోద్యోగులలో తగిన వెలమ వారసుడు లేదు. వీరనాయుడు వెలమ ప్రభరించాలని నిర్ణయించాడు. ఇప్పుడతనికి సహాయం కావాలి. ఒక నిర్ణయానికి వచ్చేడతను. దండనాయకులు నిద్రలో ఉండగానే బయటికి వచ్చేడు వీరనాయకుడు.
వీరనాయకుడు ముగ్గురు మిత్రుల్నీ కలుసుకోవడానికి బయలుదేరేడు. ఇనుగంటివారిశర్మ, పోతారెడ్డివారు. భూపాలరెడ్డివారు. పోతారెడ్డివారు యుద్ధవ్యూహంలో, దండును నడిపించడలో సమర్ధుడు. భూపాలరెడ్డివారు భూములు, వ్యవసాయం పన్నులు మొదలైన శాఖలను పర్యవేక్షించడమే కాక మొత్తం రాజధాని పాలనావ్యవస్థలో కీలకమైన వ్యక్తి. కానీ మహామంత్రులవారు, మహాదండనాయకులవారు, మరో నలుగురు ప్రభువులవారి ఆంతరంగికులు కావడంతో ఇద్దరూ సూర్యశోభ సోకని చందమామవలె ఉండిపోయారు. వీరనాయకుడి వీరిరువురినీ ఎంచుకుని మూడు సంవత్సరాలైంది. జాతిస్నేహం వీరనాయకుడి ఇంద్రజాలం ముందు రెడ్డివార్లు చిత్తయిపోయారు. వీరి ముగ్గురి సాన్నిహిత్యం మహాదండనాయకులవారితో సహా ఎవరికీ తెలియదు. ఇనుగంటివారి శర్మ పండితుడు, లోకజ్ఞత ఉన్నవాడు. పోతారెడ్డివారికి ఎన్నో సంవత్సరాల నుంచి ఆంతరంగికుడు. ఇప్పుడీ వలయాన్ని దండనాయకులవారి చుట్టూ బిగించాలి. పోతారెడ్డివారి ఇంట్లో నలుగురూ సమావేశం అయినారు. దండనాయకులవారి కుమారుడు ఈ పరిస్థితుల్లో రావడం వారి ముగ్గురికీ ఎంతమాత్రం ఇష్టం లేదు తమ ప్రాముఖ్యం, పలుకుబడీ గోదారి పాలవుతుంది. అప్పుడు వీరనాయుడు తన వ్యూహాన్ని వారిముందు పరిచాడు. ఒకటి వర్తమానం పంపింవలసినపుడు ఆశ్వికులు అంచెలంచెలుగా వెళతారు. ఆ జాగ్రత్తలు పడ్డానికి పోతారెడ్డివా రంగీకరించారు. ఇకపోతే పోతారెడ్డివారే దండనాయకులవారికి వారసులు. ఆయన చిరునవ్వుతో అంగీకరించి సాభిప్రాయంగా వీరనాయకుడి వంక చూశారు. నాయకుడన్నాడు.
‘‘మహామంత్రివారు అడ్డు చెప్పరు.’’
‘‘ఏం?’’ అన్నాడు భూపాల రెడ్డిగారు.
‘‘ఏమంటే, ఇనుగంటివోరు అటువేపు నుంచి నరుక్కువస్తారు.’’ ముగ్గురూ శర్మవారివేపు చూశారు. భూపాలరెడ్డి వారన్నారు. ‘‘ఇనగంటివారూ, మీ రొక్కరే చక్కబెట్టగలరు. కానీ తమరూ, పురోహితులవారూ కలిసి పెద తల్లిగారితో సంప్రదించండి. అది అమ్మ ద్వారా జరిపించవలసిన కార్యం. ముందు పురోహితులవారిని కలవండి. వీరనాయుడు సంతోషంగా నవ్వేడు.
‘‘మంచి ఆలోచన చెప్పినారు సామీ. నేనయితే కోనమండలం మీకు ఇచ్చేస్తాను.’’ కాసేపు నలుగురూ మౌనంగా ఉండిపోయారు. వారి ఆలోచనల బరువుతో గాలి ఘనీభవించింది.
