-
-
తపన
tapana
Author: Kasibhatla Venugopal
Publisher: Aksharam Prachuranalu
Pages: 165Language: Telugu
కాశీభట్ల వేణుగోపాల్ వ్రాసిన ‘తపన’ 1999 సంవత్సరానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) స్వాతి పత్రికతో సంయుక్తంగా నిర్వహించిన రెండవ నవలల పోటీలో లక్ష రూపాయల ఏకైక బహుమతి పొందింది.
ఈ నవలలో కథావస్తువు, పాత్ర చిత్రణ, కథనశైలి, భాషా ప్రయోగం చాలా ప్రత్యేకమైనవి. మామూలు నవలలో కనిపించనివి. దాంపత్య సంబంధాలు కథావస్తువుగా చాలా నవలలు, కధలూ వచ్చాయి. కానీ, ఈ నవలలో భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ఇంతకు ముందు ఏ తెలుగు నవలలోనూ చూసిన గుర్తులేదు. మనుషులకు తమ గురించీ, తమ మనస్సు గురించీ, తమ ప్రవర్తనల గురించీ స్పష్టంగా తెలుసుననుకోవటం చాలావరకు భ్రమ మాత్రమే అని మానసిక శాస్త్రం వాదం. కథ నడిచిన నాలుగు రోజుల వ్యవధిలో కథానాయకుడు తనగురించీ, తన భార్య గురించీ, తన జీవితం గురించీ కొత్త సత్యాలను తెలుసుకుంటాడు. ఈ పరిణామాలు మనకు కొంత ఆశ్చర్యంగా అనిపించినా, అసహజం మాత్రం కావు.
తెలుగులో చైతన్య స్రవంతి శైలిలో వచ్చిన బహుకొద్ది నవలలలో ‘తపన’ ఒకటి. చైతన్య స్రవంతి పద్ధతిలో సాగే రచనలు స్పష్టంగానూ, అస్పష్టంగానూ మన ఆలోచనల్లో జొరబడే అనేక సంకేతాలతో నిండి ఉంటాయి. రచయితకు విస్తృతమైన విషయ పరిజ్ఞానం, మానసిక శాస్త్రంలో ప్రవేశం ఉంటే తప్ప ఈ శైలి రాణించదు. ఈ సంకేతాలు అసంబద్ధమూ, అసంగతమూ కాకుండా ఉండాలంటే చాలా నేర్పు అవసరం. ఈ రచయిత చేతిలో ఈ శిల్పం చిన్నపిల్లల ఆటలంత తేలికగా అనిపిస్తుంది.
ఈ తానా నవలల పోటీలో ‘తపన’ కు బహుమతి రావటం నూతన పద్ధతులతో, నూతన భావాలతో, ప్రయోగాత్మకంగా వ్రాసే రచయితలకు నూతన ప్రోత్సాహాన్ని, స్పూర్తినీ ఇస్తుందనే నా నమ్మకం.
- జంపాల చౌదరి
ఇది నవల కాదు, కవిత్వం. ఒక్క పది పేజీలు చదవగానే తలపోటు వచ్హింది. దీనికి బహుమతి ఎలా వచ్హింది?
నేను చదివిన కాశీభట్ల గారి మొదటి నవల "తెరవని తలపులు". మొదటి కొన్ని పేజీలు భొరింగ్ గా అనిపించింది,కానీ తర్వత తర్వాత నవల పూర్తి అయ్యెవరకు కనురెప్ప వెయ్యలేదు. నేను నవలలు చదవను, ఎక్కువగా Short Stories చదువుతాను. కానీ తెరవని తలపులు చదివాక వరసగ కాశీభట్ల గారి నేనూ చీకటి, రంగుల గది, తపన చదివేసాను. కాశిభట్ల గారు అన్నట్లు వచన కవిత అన్న పక్రియ వున్నప్పుడు..కవితా వచనం వుండటంలో తప్పులేదు.. ఇప్పటివరకూ నామిని, నక్కా విజయరామరావు, వంశీ, కేశవ రెడ్డి, దాసరి అమరెంద్ర గారి ట్రావెలాగ్స్ మరియూ అనేక అనువాద పుస్తకాలు చదివిన నాకు కాశీభట్ల గారి రచనా శైలి ఆశ్చర్యాన్ని,ఆనందాన్ని కలిగించింది.కాశీభట్ల గారి రచనలలో కదానాయకుడు తాగుడుకు బానిసైనట్లు నేను ఆయన రచనలకు బానిసనయ్యానని గర్వంగా చెప్పగలను.