-
-
పూలమ్మిన ఊరు
poolammina vooru
Author: Perugu Ramakrishna
Publisher: Palapitta Books
Pages: 112Language: Telugu
లోకంలోని విభిన్నాంశాలపై ఆర్ద్రమైన రీతిలో కవిత్వం రాసే సృజనశీలి పెరుగు రామకృష్ణ. కవిత్వం కోసం నిరంతరం తపించడం వారి నైజం. కవిత్వమంత అందంగా జీవించాలన్న ఆరాటం వారి స్వభావంలోనే వుంది. అంతరంగపుటాలోచనలు, సామాజిక సంవేదనలు కలగలసి రామకృష్ణ కవిత్వానికి జీవశక్తినిచ్చాయి. వ్యక్తి బహిర్ ప్రపంచం, అంతర్ ప్రపంచం వేర్వేరుగా కనిపించినా, పరస్పర ఆధారితం, పరస్పరం ప్రభావితం కావడం కూడ సహజం. రామకృష్ణ కవిత్వంలో కనిపించే ఊహాశాలితకీ, ఇమేజరీ లోకి మూలం ఇక్కడే వుంది. భాషని పదునుగా
వాడుకోవడం తెలిసిన కవి. మామూలు మాటలుగా కనిపించే కొన్ని భావచిత్రాల్లో ప్రగాఢమైన భావనాశక్తి దాగివుంది. 'పూలమ్మిన ఊరు' అని ఈ పుస్తకానికి పెట్టిన శీర్షిక అనల్ప భావాల సమ్మిశ్రితం. చిన్నచిన్న పదాలలోనే ఉదాత్తమైన భావాల్ని ప్రతిఫలించడం రామకృష్ణ కవిత్వశైలిలోని విశిష్టత. కవిగా ఎంతోకాలం నుంచి విశేషమైన కృషి చేస్తున్న రామకృష్ణ కవిత్వంలోని నవ్యతకు, ఈ కాలపు చేతనకు ప్రతీక ఈ కవితా సంపుటి.
- పాలపిట్ట బుక్స్
* * *
ఒక గమనమే
అందులో సమూహమూ, ఏకాంతమూ రెండూ
ఏదీలేని దిక్కుతోచని క్షణం
కాగితం మీద నేను బరువుగా అక్షరాన్ని వుంచుతాను
అది గాలికి ఎగిరిపోకుండా
ఎటూ వెళ్ళిపోకుండా...
ఒక్కమాట నిజం...
నేను శూన్యంలో వున్నప్పుడు
అక్షరం వెలుతురై నాముందుంటుంది
మనిషే గొప్ప అక్షరం...
రహస్యంగా మాతృగర్భంలో
తొమ్మిది నెలలుగా మలచబడ్డ జీవాక్షరం
ప్రపంచాన్ని ధిక్కరించి
నిలువెత్తు అక్షరంగా పెరిగాను నేను
నా బలమే నా
అంతర స్పర్శ
నా జ్వలనమే నా ప్రవాహం...
