-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
కుండీలో మర్రిచెట్టు (free)
kundilo marrichettu - free
Author: Vinnakota Ravisankar
Language: Telugu
జీవిత పుటల్ని చివరిదాకా తిరగవేసే ఆసక్తీ , నిజాయితీ, ధైర్యమూ రవిశంకర్ కున్నాయి. ఒకటి రెండు పుటలతో చాలించి, అదే విషయాన్ని అదే పదజాలంతో పునః పునః పునః పునర్నినదించే నినాదకవి కా డితను. ఎంత అనుభవ వైవిధ్య ముందో అంత ప్రగాఢతా ఉంది ఇతని కవిత్వానికి.
కళకి ఇంత పర్యాప్తమైన నిర్వచనం ఎక్కడా నాకు తారసపడ లేదు. జీవితపు విలువలతోనే కదా కళకి ప్రమేయం. ఈ సత్యాన్ని ప్రవించడం కాదు ఈ కవిత చేసిన పని, ఇది మనకు అనుభూతమయేటట్లు చేసింది. అనగా, ఒక యథార్థాన్ని ఆలోచనా రూపంలో కాక అనుభవ రూపంలో మనకు ప్రసాదిం చింది. ఇదే కవిత్వసారం.
మానవత్వపు సారాంశాలైన జీవితానుభవాలతో స్పందించే కవితలు ఈ పుస్తకం నిండా వున్నాయి. పై నుదహరించినవి కాక ' కుండీలో మర్రిచెట్టు', 'రామప్ప సరస్సు', 'జ్ఞాపకం', 'నిద్రానుభవం', 'చలనచిత్రం', 'పాపమనసు' వంటి విషా దంతో, ఆనందంతో, ఉత్సాహంతో, అనురాగంతో, పురాజ్ఞాపకాలతో మెరిసే, మండే, మిరుమిట్లు గొలిపే జీవితశకలాలెన్నో ఈ కవి మనకు సమర్పించాడు.
కవిత్వగడియారపు లోలకం ఆ చివరినించి ఈ చివరికి ఊగినట్లుందీ మధ్య. భావకవులు వాస్తవానుభవాల్ని విస్మరించి, ఆంతరంగికమైన అనుభూతుల్నీ, భావాల్నీ వ్యక్తీకరించటమే పనిగా పెట్టుకున్నారు. ఒకలాంటి పొగమంచు ఆవరించి నట్లుంటుంది వారి కవిత్వం. యథార్థదృశ్యాలు కనిపించవు. ఇప్పుడు లోలకం ఇటు మళ్ళాక, కవిత్వంలో అనుభూతి లోపించి, కవిత్వమంటే పదాలూ, ఆలోచనలూ తప్ప మరేంకాదు అనే అపోహ వ్యాపించినట్లుంది. లోలకాన్ని మళ్ళించినవాడు శ్రీశ్రీ. ఐతే, దాన్ని ఈ కొసకి తీసుకువచ్చినవాళ్ళు బైరాగి, ఆరుద్ర, అజంతా,మోహనప్రసాద్, శివారెడ్లు. కవిత్వమంటే మాటలు తప్ప మరేం కాదన్న అభిప్రాయం ఈ నాటి యువకవుల్లో పాతుకున్నట్లుంది. అనుభవమూ, అనుభూతీ, రెండూ సంయోజిస్తేనే కాని కవిత్వపు విద్యుత్ స్పులింగం పుట్టదనే గ్రహింపు చాలామంది కవులకు ఉన్నట్లు తోచదు. భావకవిత్వం పూర్తిగా ఆత్మాశ్రయమైతే, ప్రస్తుత కవిత్వం పూర్తిగా వస్త్వాశ్రయమైనదనవచ్చు. ఐతే, ఈ వస్తువుకూడా వాస్తవమైన జీవితానుభవం కాదు. దానికి నకిలీ ప్రతిగా నిలబడే వట్టి మాటలూ, ఆలోచనలూ, సిద్దాంతాలూ, నినాదాలూనూ.
రవిశంకర్ కవిత్వ నావ మాటల ప్రవాహంలో కొట్టుకుపోదు. దానికి గమ్యముంది.
జీవితానుభవమూ, హృదయానుభూతీ - ఈ రెండు ధృవాల్నీ కలిపి కవిత్వ విద్యుచ్చక్తిని సృష్టించాడు కవీ, విద్యుత్ ఇంజనీరూ ఐన రవిశంకర్. ఇటువంటి కవులు అరుదుగా వుంటారు. ఇదింకా ఇతని మొదటి పుస్తకం.
22-11-1992
----ఇస్మాయిల్
This book is now available in Tenglish script with Kinige. For details, click the link.