-
-
కంకణ రహస్యం
kaMkaNa rahasyaM
Author: Madhubabu
Publisher: Sri Srinivasa Publications
Pages: 305Language: Telugu
మనం ప్రతిరోజు చూసే పర్సనాలిటీలను మన నిత్య జీవితపు వాతావరణంలో కలిపి కాస్తంత థ్రిల్‌ని మేళవించి మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా వ్రాయటం మధుబాబు స్పెషాలిటీ. షాడో కథలు వ్రాసినా, క్రైమ్ ఎడ్వంచర్స్ వ్రాసినా, కథల మధ్యలో గేయాలు వ్రాసినా కొట్టవచ్చినట్లు కనపడుతోంది మధుబాబు ముద్ర. తనదైన ఆ బాణీలో పాఠక లోకాన్ని మురిపింపచేయడానికి మధుబాబు మలచిన మరో క్రైమ్ ఎడ్వంచర్- కంకణ రహస్యం.
* * *
పిడుగుల మాదిరి వంటిమీది పడుతున్న దెబ్బల్ని ఇసుమంత కూడా లక్ష్యపెట్టకుండా వెనక్కి తూలిన దృఢకాయుడి ముఖాన్ని వికృతంగా గాయపరిచాడు వాత్సవ.
"పట్టుకోండి అతన్ని... వెనక్కి లాగండి..." ఖంగుమంటున్న కంఠంతో రామ్భూలా ఆజ్ఞ యిచ్చేసరికి, అతని చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకొని బడబడా వెనక్కి లాగారు రామ్భూలా అనుచరులు.
చినిగి పీలికలైపోయింది వాత్సవ షర్టు... రక్తసిక్తమైంది ముఖం... నల్లబడి సగానికి సగం మూసుకుపోయింది ఎడమ కన్ను. అయినా సరే తన స్పీడ్‌ని తగ్గించుకోలేదతను.
"నా మనిషిని గురించి చెడుగా మాట్లాడితే చేతులు ముడుచుకు కూర్చుంటానని అనుకోబోకండి... నేను ఖతమైపోయేలోపల మీలో నలుగుర్ని నాశనం చేయటం చేయటమే..." దెబ్బతిన్న బెబ్బులి మాదిరి గర్జించాడు ఒంటి కన్నుతో క్రూరంగా చూస్తూ.
సీరియస్‌గా చూస్తున్న రామ్భూలా పెదవులమీద ప్రత్యక్షం అయింది ఒక చిరునవ్వు.
