-
-
జగన్నాథ కథచక్రాల్
jagannaatha kathachakraal
Author: A.N.Jagannadha Sharma
Publisher: Amaravathi Publications
Pages: 207Language: Telugu
కొందరికి మాత్రమే పరిమితం అనుకునే పేజీని అందరూ చదివేలా చేయడం అంత సులభం కాదు. అందరికీ సాధ్యమూ కాదు. అరుదైన ఆ విజయనికి జగన్నాథశర్మ సారధ్యం వహించారు. దాన్ని సుసాధ్యం చేసారు. అది ఆ పేజీకే పరిమితం కాకుండా చక్రాలు కట్టుకుంది.... చకచకా పరుగులు తీసింది. 'జగన్నాథ కథచక్రాల్'గా పుస్తక రూపం సంతరించుకుంది.
ఒకప్పుడు దిన, వార, పక్ష, మాసపత్రికలన్న తేడా లేకుండా ఎడిట్ పేజీ అనగానే ఓ పడికట్టు ధోరణి ఉండేది. ముఖ్యంగా వారపత్రికలైతే పాఠకులు, ముందు పేజీలో ఏముందో చూసే ఓపిక లేకుండా తమకిష్టమైన పేజీల్లోకి నేరుగా వెళ్ళిపోయేవారు. తమకు నచ్చిన వాటిని గబగబా చదివేసుకుని, ఆనక మిగిలిన పుటలను తీరిగ్గా తిరగేసేవారు. తన రాకతో, రాతలతో ఆ పోకడను మార్చిన ప్రతిభావంతుడైన సంపాదకుడు జగన్నాథశర్మ. నందీశ్వరుడికి నమస్కరించకుండా శివలింగాన్ని చేరలేనట్లు ఎడిట్ పేజీని చదవకుండా లోపలి పేజీల్లోకి వెళ్ళజాలని పరిస్థితిని ఆయన 'నవ్య వీక్లీ' పాఠకులకు కల్పించారు.
అందమైన శిల్పాన్ని చెక్కినట్లుండే అద్బుతమైన పని'వాడి'తనంతో, ముగ్ధ మనోహరమైన ముఖానికి ముచ్చటైన తిలకంలాంటి సింగారంతో, లోపలి పేజీల్లోకి పరుగుతీయకుండా మొదటి పేజీకి కళ్ళప్పగించేలా చేశారు జగన్నాథశర్మ. 'గుండె గుప్పెండత.... ఊహ ఉప్పెనంత' అన్న కవి మాటను నిజం చేస్తూ జగన్నాథ శర్మ 'నవ్య వీక్లీ' ఎడిట్ పేజీలో వారం వారం రాస్తున్న కథలు పాఠకులని కదిలిస్తున్నాయి. కరిగిస్తున్నాయి. దర్శనాంతరం గుడి మెట్ల మీద కాసేపు కూర్చునేటట్లు కథ చదవడం పూర్తి చేసిన తర్వాత గబుక్కున పేజీ తిప్పేయకుండా అదే పేజీలో అక్షరాల్ని చూపులతో తడిమి, హృదయంతో ఆలోచించేలా చేస్తున్నాయి. అలాంటి వాటిలో అనేకులు మెచ్చిన అత్యుత్తమైన 100 కథల్ని ఎంపిక చేసి, ఏరి కూర్చిన ఈ సంకలనం విభిన్న పార్శ్వాల జీవిత గుచ్ఛం. ఇందులోని ప్రతీ కోణం మిమ్మల్ని పలకరిస్తుంది. మీ హృదయాల్ని కథ చక్రాల్లా పరుగులు తీయిస్తుంది.
