-
-
ఈ కాలమ్
e kalam
Author: Volga and Vasantha Kannabhiran
Publisher: Asmita Resource Centre for Women
Pages: 168Language: Telugu
వార్త దినపత్రికలో ఓల్గా, వసంత కన్నాభిరన్ జంటగా రాసిన శీర్షిక "వంటింటి మసి". 2010 డిసెంబరు నుంచి 2011 డిసెంబరు చివరి వరకూ 50 వారాలపాటు కొనసాగిన కాలమ్ ఇది. అసమానత్వం, ఆధిపత్యం, హింస, అత్యాచారం, అవినీతి, దోపిడి, మూఢత్వం - ఇవి కొనసాగుతున్న రోజుల్లో ఆయా అంశాల గురించి ఈ జంటకాలమిస్టులు చేసిన వ్యాఖ్యలు, విశ్లేషణలు ఒక రాజకీయ దృష్టికోణాన్ని, సమస్యల లోతు గురించిన అవగాహనని కలిగిస్తాయనే ఉద్దేశంతో "ఈ కాలమ్" ను పుస్తకంగా తెచ్చారు.
* * *
"మాడ్యులర్ కిచెన్స్ విస్తరిస్తున్న ఈ కాలంలో వంటింటి మసేమిటి? ఎక్కడుంది అని ఆశ్చర్యపడకండి. ఇదుగో ఈ ఫెమినిస్టులంతా ఇంతే లేని బూచిని చూపిస్తారని తొందరపడి ఆగ్రహించకండి. మాడ్యులర్ కిచెన్ అయినా మట్టిపొయ్యి అయినా స్వభావంలో మార్పు లేనంత వరకూ, మసి జిడ్డు ఒదలవు. వాటిని ఎంత తోమీ వదిలించలేం, మన సమాజంలోని అనేకానేక రుగ్మతల్లాగానే. ఐతే మాకు మసిని, జిడ్డుని తోమి, తోమి ఒదిలించడం అలవాటు. మళ్ళీ మురికవుతుందని తెలిసీ రోజూ వంటింటి సామాగ్రిని తళతళ మెరిపించేందుకు చెమటోడుస్తాం. అలాగే సమాజంలోని సాంఘిక రాజకీయ జాడ్యాలను తోమాలనే తహతహే ఈ కాలమ్ తలపెట్టడానికి కారణం. ఈ ఒక్క పేజీలో సామాజిక, రాజకీయాలకు పట్టిన దట్టమైన మసి మీద ఇంత బూడిద, మట్టి వేసి తోముదామని మొదలుపెడుతున్నాం.
దీన్తో మేమేదో గొప్పగొప్ప విశ్లేషణలు, ఫెమినిస్టు సిద్ధాంతాలు చెపుతామనుకుంటే సారీ - మీరు నిరాశపడతారు. మాకంత శక్తి లేదు. ఏదో - చీపురు, పీచుతో తోమినట్టు తోమటం తప్ప మాకు మరేం చేతకాదు.
ఐతే అవి మరుసటి వారం దాకానైనా మెరుస్తాయని గ్యారంటి మాత్రం ఇవ్వగలం."
