-
-
అవతలి వైపు
avatalivaipu
Author: Sripada Swatee
Publisher: Self Published on Kinige
Pages: 188Language: Telugu
స్వాతీ శ్రీపాదది బహుముఖీనమైన కృషి. ఆ కృషిలో లోతైన చైతన్య స్రవంతి. ఆమె Indo-Anglian కవిత్వం, నవలారచన, కథానికా సాహిత్య మర్మాల మథనం- ముఖ్య మాధ్యమాలు.
సృజనాత్మక పథంలో కథానికనూ, అనుసృజనాత్మక పట్టికలో అనువాదాన్ని- ఆమె ఎంచుకోవచ్చని నా ఊహ. ఏది ఏమైనా ఆమె ఇప్పుడు గొప్ప (తరగని) సృజనాత్మక నేపథ్యంలో నిలిచివుంది. ఆ నేపథ్యం కొంత లౌకిక దృష్టి, దాని వెన్నంటే కొంత తాత్త్విక పరిశీలనాదృష్టి. ఇక్కడ- ఒక అంతర్యుద్ధం అనివార్యం.
ఆ అనివార్యతను రచయిత యొక్క సాంఫిుక సాంస్కృతిక సామాజిక నేపథ్యం నిర్ణయిస్తుంది. ఆ నేపథ్యం- మధ్యతరగతి సంక్లిష్ట మనస్తత్వం అస్తిత్వమా- వాళ్లది అభద్రతా భావ డోలిక. ఆదర్శమా- మహోన్నత మానవతా దర్పణం. కొంచెం మెట్ట వేదాంతం. ఎక్కువ భాగం పరంపర. అందులోనే ఇరుకు బాటలు, అందులోనే ఆకాశం అంత ఎత్తుగల విశాల స్వప్నాలు.
ఈ civil war చాలా కథల్లో గోచరమవుతుంది. ఆమె శైలీ ప్రవాహ వేగంతో పఠితను ఆ బలమైన గాలి- ముందుకు తోస్తూనే వుంటుంది. అరిషడ్వర్గాలు, పశ్చాత్తాపాలు, అంతర్మథనాలు, క్షణికావేశాలూ, శాశ్వత ముద్రలూ- మానవుడి సవాలక్ష మానసిక చలనాలు అనిశ్చితాలూ- అన్నిటి మధ్యా పరస్పర సంయమనంతో కూడిన సంఘర్షణలు- సభ్యతా లోక Rules ప్రకారమే తటస్థిస్తాయి. అది శ్రీపాద స్వాతి రచనా యోచనా సామర్థ్యానికి గీటురాయి.
వేలాది తిట్లు, తిమ్ములు, ఈసడింపులు, హేళనలకు- ప్రతిసారీ- గురి అవుతున్న మధ్యతరగతి జీవన ధర్మాన్ని కేతనంగా ఎత్తిన ఈ కథారచయిత్రి స్వాతి శ్రీపాదకు ముందెంతో ఆశావహ భవిష్యత్తు వుంది. ఎక్కడ? ఆంధ్ర సారస్వతలోకంలో, నా మాట ఎన్నడూ వమ్ము కాలేదు. శుభమ్.
- మునిపల్లె రాజు
