-
-
ఏ గానమో? ఇది ఏ రాగమో?
Ye Gaanamo Idi Ye Raagamo
Author: Dr.Y.Shiva Rama Prashad
Publisher: Shanta Vasantha Trust
Pages: 204Language: Telugu
సంగీతం ప్రపంచ భాష. ఆ భాషను ప్రకటించే అనుభూతి పాట. శబ్దం మాటగా పుట్టినప్పటి నుండి భాష పాట రూపాంతరం చెందింది. జానపదుల నుండి పండితుల వరకు సంగీతం, భాష, పాట అన్నీ క్రొత్త క్రొత్త రూపాలను సంతరించుకుంటూ సంగీతం శాస్త్రంగా తయారైంది. వాగ్గేయకారులు, సంగీతజ్ఞులు అపార సంగీత, భాషా, సాహితీ ప్రక్రియలు చేసి ఆ రంగాలకు అగ్రతాంబూలం ఇచ్చి పాటకు శాశ్వతత్వం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం వచ్చి కొత్త దారులు వేసింది. పాట ఫలానా రాగంలో ఉండలనే పద్ధతి, రాగంలోనే కాదు అన్యస్వర ప్రయోగం చేసినా పాట మాధుర్యం ఏమాత్రం చెక్కు చెదరకూడదనే భావన వచ్చింది. ఏమైనా పాట బహుళ జనాదరణ పొందాలనే భావన వచ్చింది. తెలుగు పాట 1931 నుండి ఎన్నో మార్పులు, చేర్పులు చేసుకుంటూ కాలానుగుణంగా వినిపిస్తూనే ఉంది. అయితే ఇపుడు అందిస్తున్న ఈ రాగ-గాన ప్రస్తారం గురించి ఒక విన్నపం. ఈ పాట ఈ రాగంలో స్వరపరిచింది అని స్పష్టంగా, నిర్ద్వంద్వంగా తెలియచేయటం జరిగింది. అయితే కొన్ని పాటలకు ఆ రాగ లక్షణాలుండి అన్యస్వర ప్రయోగం కూడా చేసుకొని పాటను రక్తి కట్టించిన సందర్భాలున్నాయి. వాటిని వీలైనంతవరకు ప్రస్తావించాను.
సాధారణంగా ఒక సాహిత్యానికి ఏ రాగం ఎంచుకొని పాటగా స్వరపరచాలి? అనే విషయంలో సంగీత దర్శకులు ఆ సందర్భాన్ని, సాహిత్యాన్ని, రసస్పర్శను పరిగణనలోనికి తీసుకుంటారు. సాహిత్యం సూచించే కోణంలో రాగాన్ని ఎంపిక చేసి పాటను స్వరపరుస్తారు. అలాంటి పాటలకు నూటికి నూరుపాళ్లు రాగ నిర్దేశకం చేయగలం. అలా కాకుండ ఒక రాగాన్ని తీసుకొని పాటను స్వరపరుస్తూ మరింత మాధుర్యం, రసస్ఫూర్తి రావటం కోసం, వినటానికి ఇంపుగా ఉండేందుకు అదే రాగంలోని అన్యస్వరం ప్రయోగించి పాటను స్వరపరుస్తారు. ఇది కేవలం మనోధర్మ ప్రతిభగా అనుకోవాలిగాని రాగ సంకరం చేసినట్లు భావించరాదు. ముఖ్యంగా ఈ నిబంధన జానపద, లలిత, సినీగీతాలకు వర్తించదని భావన. ఇలాగ రాగ పరిధులు, పరిమితులు దాటి ప్రజారంజకమైన పాటలు సృష్టించిన సంఘటనలు కోకొల్లలు. రెండు రాగాలను కలిపి పాటను ఫలవంతం చేయటం కూడ ధ్యేయంగా కనిపిస్తోంది. మన పూర్వీకులు రాగాలను నిర్దేశించినపుడు వాటి సంపూర్ణ లక్షణాలు, సమయాలు, వినిపించే విధానాలు సమగ్రంగా దిక్సూచిగా అందించారు. అయితే కాలక్రమంలో కొన్ని మనోధర్మ సంగీతంలో నూతన పోకడలు మొదలైనాయి. ఇవి సినీగీతాలపైన ప్రభావం చూపాయి.
రాగ సమయములు, రాగ లక్షణాలు అన్నీ ఉన్నా విరుద్ధ ప్రయోగాలు చేసి ప్రజాదరణ పొందిన పాటకు అగ్రతాంబూలం ఇవ్వటం ప్రధానంగా మారింది. ఒకోసారి స్వరకర్తలు ఇచ్చిన, తనన తనన స్వరాలకు రచయితలు అవలీలగా పదాలల్లిన సందర్భాలున్నవి. ఈ రెండు ప్రక్రియలలో ''పాట''కు ప్రాణం పోయటమే ధ్యేయంగా పెట్టుకొన్నారు. సినిమా పాటలు స్వరపరచేటప్పుడు శుద్ధరాగాలను తీసుకొని పాటలను స్వరపరచాలనుకోవటం కత్తి మీద సాము, నెత్తి మీద పాము వంటిది. ఒక రాగంతో పాట గమనంలో పాట యొక్క రమ్యత, శ్రావ్యత కోసం ప్రయత్నిస్తారు. అందరినోటా పాట పదికాలాలు ఉండలనే తపనతో ఆ రాగానికే కట్టుబడక అన్యస్వర ప్రయోగంతో పాటను రక్తి కట్టించం ఒక శుభ పరిణామంగా అనుకోవాలి. అన్ని సాహిత్యాలు రాగ గతులలో సరిగా అమరక పోవచ్చును. అందువలన అలా చక్కగా ఒదిగిన రాగాల గీతాలు కొన్ని, అన్యస్వర ప్రయోగాలు చేసిన వాటిని కొన్ని అందిస్తున్నాను.
- డా. వై. శివరామ ప్రసాద్
Hi.. Can u provide the book "KEY TO KEYBOARD" by S Trinadharao -thanks