-
-
యాత్ర - 2
Yatra 2
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 319Language: Telugu
చరక్ కారు ఫ్రంట్ డోర్ తెరిచి ఆమెను ముందు సీట్లో కూర్చుండజేశాడు. తను అటు తిరిగి వచ్చి డ్రైవరు సీట్లో కూర్చున్నాడు. వెనక సీట్లో అగ్నివేశాచార్యుడు, గోవిందపాత్రుడు, శివరామ ముకుంద పాత్రుడు కూర్చుని డోర్ మూశారు. కారు ఇంజను స్టార్ట్ చేశాడు చరక్.
మిత్రవిందకు అమితాశ్చర్యంగా ఉంది. “భయపడకు మిత్రా, దీన్ని కారు అంటారు. పరుగెత్తుతుంది చూడు” అంటూ కారును ముందుకు దూకించాడు. కారు ముందు కదిలాక జీప్ స్టార్ట్ చేసి అనుసరించాడు డ్రైవర్ కాశీ.
మిత్రవింద ముఖంలోని విభ్రాంతినీ, విస్మయాన్నీ స్పష్టంగా చూస్తున్నారంతా. ఆమె చరక్ భుజాన్నీ వదలటంలేదు. వెనక్కుపోతున్న అడవినీ, చిన్న చిన్న అడవి జంతువులను పసిపాపలా చూస్తోంది.
“మిత్రా....” గోముగా పిలిచాడు చరక్.
“ఊఁ” అంది మిత్రవింద.
“ఈ వాహనము ఎటులున్నది?” అడిగాడు.
“అద్బుతము... చచ్చింది గొర్రె” అంది అచ్చతెలుగులో మిత్రవింద. ఆ పలుకులు విని ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారంతా.
తెలుగు భాషేతెలీని అమ్మాయి అచ్చ తెలుగులో “అద్భుతముగా చచ్చింది గొర్రె” అంటే అందరికీ షాకే. చరక్ వింతగా తనను చూడ్డం చూసి- “ఏల నటుల వీక్షించుట? చచ్చింది గొర్రి యనిన తెలుగు భాషయందు అంతయూ బాగున్నదని అర్ధము అని ద్వారకలో నీవేగదా నుడివితివి?” అంది గడుసుగా.
ఆ మాటలు వినగానే ఏం జరిగిందో ఊహించి వెనకసీట్లోని అగ్నివేశాచారుడు, మిగిలిన వారు పకపకా నవ్వారు. తలపట్టుకున్నాడు చరక్.
ఎప్పటిమాట! ఎంతటి ధారణశక్తి! ఈమె బుర్రలో ఉన్నది మెదడా లేక కంప్యూటరా అన్పించింది.
“ఏరా చరక్. అమ్మాయితో అబద్ధాలు కూడా చెప్పావన్నమాట. అమ్మా మిత్రవిందా” అంటూ ఆమెతో దేవనాగరిలో చచ్చింది గొర్రి అనేమాట ఊతపదమనీ, ఆ మాటకి అర్ధం అంతా బాగుందని కాదు, గొర్రె చచ్చిందని అర్ధం” అంటూ వివరించగానే మిత్రవిందకూ నవ్వాగ లేదు.
“చతురా... నాతో చతురాడినావుగదూ, మీ భాష తెలియదనేగా, నేనునూ మీ భాష అభ్యసించి అపుడు జెప్పెద” అంది గడుసుగా.
దారిలో కరెంటు స్తంభాలమీద తీగలను చూసి అవి ఏమిటి అంటుంది. ఆకాశంలో విమానం పోతుంటే చూసి దేవతలు విమానయానం చేస్తున్నారంటుంది. కోరుకొండ ఊరు చేరేసరికి అక్కడ గోడలమీద సినిమా వాల్ పోస్టర్లను చూసి “అది ఏమి? ప్రాకారములపై చిత్రములు కన్పించుచున్నవి?” అంటుంది.
ఇలా దారిపొడవునా పసిపిల్లలా చరక్ను ప్రశ్నిస్తూనే ఉంది మిత్రవింద. హైవేలోకి వచ్చేసరికి కార్లు, బస్సులు, మోటార్ సైకిళ్ళు, ఆటోలు, సైకిళ్ళు, రిక్షాలు అన్నిటినీ విభ్రాంతురాలై చూస్తూనేవుంది.
చివరకు ఇక్కడ మనుషులంతా పొడుగులేరేమి? ఆరోగ్యంగా, బలంగా లేరేమి? స్త్రీలు మరీ పొట్టిగా ఉన్నారేమి అంటూంటే - కొన్నిటికి అగ్నివేశాచార్యులు బదులిచ్చి చరక్కు శ్రమతప్పించాడు. కనుచీకటి పడకముందే అంతా ఎస్టేట్ భవంతికి చేరుకున్నారు.
Nice imagination by the author to take us back to The day Dwaraka immerses in sea. Brilliant capture of emotions of people of that time. Well done Suryadevara!
very nice story.. really awesome