“బిందూ, నువ్వూ వెళ్ళి మిగిలిన పని పూర్తిచేయండి. వెళ్ళండి! ఆలస్యం చేయవద్దు ఊఁ! కదలండి” అంటూ తొందర చేశాను. ముఖేష్ ఏం మాట్లాడలేకపోయాడు.
నా చెయ్యి గట్టిగా నొక్కి బయలుదేరాడు నా వంక చూస్తూ, కన్నీరు విడుస్తూ బిందుకూడా అతని వెనకాలే వెళ్ళింది.
వాళ్ళు కనుమరుగై పోయేదాకా రెప్ప వాల్చకుండా చూస్తూ కూర్చున్నాను.
“అయిపోయింది. ఈరోజు గడిచేటప్పటికి నేను చైనా సైనికుల చేతిలో చావటమో! లేక గాయంవల్ల చావటమో! ఏదో ఒకటి జరుగుతుంది! సి.ఐ.డి లందర్నీ ముప్పతిప్పలు పెట్టి, ధనవంతులందరికీ సింహస్వప్నమై చరించిన షాడో చైనా భూభాగంలో అంతిమ శ్వాస తీయబోతున్నాడు” నా ఆలోచనకు నాకే నవ్వు వచ్చింది.
“చస్తే మాత్రం ఏం? దేశం కోసం ప్రాణాలు యివ్వబోతున్నాను. ఇంతకంటె ఏం కావాలి?” ఇలా తలాతోకా లేని ఆలోచనలతో కాలక్షేపం చేస్తున్నాను.
ఏదో చప్పుడు వినబడటంతో కళ్ళు విప్పి చూశాను. ఒక చైనా సోల్జరు పొదలను వెతుకుతూ వస్తున్నాడు.
సమయానికి కత్తి కూడా లేకపోయింది. ఏం చేద్దామా అని ఆలోచించాను.
Preview is not coming plz send me the preview at least 20 pages so we can download plz