-
-
వొయినం
Voinam
Author: Jajula Gowri
Publisher: Vishala Sahitya Academy
Pages: 117Language: Telugu
భారతీయ సాహిత్యంలో గ్రామీణ వ్యవసాయ ఉమ్మడి కుటుంబాల గురించి ప్రేమ్చంద్ నవలలు మొదలుకొని గత వందేళ్ళుగా అనేక నవలలు వచ్చాయి. వాటిలో 'వొయినం' ఒక విశిష్టమైన నవల. భారతీయ సమాజంలో వర్ణవ్యవస్థ, కులవ్యవస్థ వ్యవసాయ సమాజం పితృస్వామిక కుటుంబ కుదురు అనేక అంతరాలను సృష్టించింది. పేదలు మరింత పేదలుగా చితికిపోవటానికి కులవ్యవస్థతో పాటు పితృస్వామిక సమాజంలో పురుషులు కుటుంబ పెద్దలు తమ స్వార్థం కోసం ఎన్నిరకాలుగా దోపిడీకి పీడనకు పాల్పడుతారో... స్త్రీల పట్ల మరింత అణచివేత ఎలా కొనసాగుతుందో తరతరాలుగా చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులను కోల్పోయిన మొగిలయ్య అతనికి అర్థాంగిగా మారిన నీలమ్మ ఈ కష్టాల గుండా ఎలా పయనిస్తూ వచ్చారో 'వొయినం' నవల చిత్రిస్తుంది.
సికింద్రాబాద్ నగర పరిసరాలలోని 1970-80 మద్య పేద మహిళల జీవితం, పరిణామాలు సంస్కృతి భాష తెలుగు సాహిత్యంలో ఈ నవలలో అస్తిత్వ చైతన్యంతో చిత్రించబడ్డాయి. తెలంగాణ ప్రజలు రాష్ట్ర రాజధాని పరిసరాల్లో నగర జీవితం కాకుండా గ్రామీణ వ్యవసాయ జీవితం ఎలా జీవిస్తూ వచ్చారో ఈ నవల మనకు తెలుపుతుంది. సజీవ పాత్రలతో, యథార్థ సంఘటనలకు సాహిత్య రూపమే ఈ నవల.
జాజుల గౌరి జీవితం, సాహిత్యం వేరుకాదు. తాను గడిచివచ్చిన జీవితాన్ని సాహిత్యంలో చిత్రిస్తున్న జాజుల గౌరి తెలుసు సాహిత్యంలో మాదిగ దండోరా ఉద్యమ నేపథ్యంలో తనను తాను తెలుసుకుంటూ మా జీవితాలు కూడా సాహిత్య యోగ్యమే అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న రచయిత్రి. రాష్ట్ర మహిళా రచయితల సంఘానికి ప్రస్తుతం అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. అలా దండోరా, దళిత బహుజన జీవితాలనుండి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, సాహిత్యంలోను,సామాజిక ఉద్యమంలోను ముఖ్యంగా మహిళా సమస్యల ఉద్యమాలలోను చురుకుగా పాల్గొంటున్నారు. అనేక పురస్కారాలను అందుకున్నారు. దళిత సామాజిక వర్గంలో పుట్టి అనేక కష్టాలను అధిగమించి సుప్రసిద్దమైన రచయిత్రి జాజుల గౌరి ఈ నవలలో తెలంగాణ ప్రజల భాషను జీవితంలోని ఒడిదొడుకులను ఎంతో ఆర్ద్రంగా చిత్రించారు.
- బి. ఎస్. రాములు
