-
-
వింత మనుషులు
Vinta Manushulu
Author: Sai Ramesh Gandham
Publisher: Self Published on Kinige
Pages: 211Language: Telugu
పిన్ని నాకోసం ప్రత్యేకంగా చేయించిన కూల్ డ్రింక్ తాగి కాలక్షేపానికి సునీతతో కాస్సేపు చదరంగం ఆడాను.
మాధవి గురించి చాలా చాలా తెలుసుకోవాలని మనస్సు, ప్రాణం తహతహలాడి పోయాయి.
సునీత ఏమనుకున్నా ఆ రోజు ఆ విషయం అడగటానికే నిశ్చయించుకున్నాను.
“సునీ, నిన్ను ఒకటి అడగాలనివుంది”
“ఒకటే !" ఫక్కున నవ్వింది
“అబ్బ ... ఏమిటా నవ్వు .. సీరియస్ గా అడుగుతున్నాను”
“అయితే .. సీరియస్ గానే అడుగు”
“మీ మాధవి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని వుంది !”
"కొంపతీసి అబ్బాయిగారు ఆవిడమీద కథ రాస్తారా ఏమిటి !”
"అది కాదు సునీ, మాధవిని చూసిన తరువాత ఆవిడలో ఏదో తెలియని ఆవేదన వుందనిపిస్తోంది” అన్నాను జాలిగా.
"ఊ" అని “అయినా అవన్నీ ఎందుకులే. నీకు కావలసింది మాధవి గురించేగా .. అయితే విను .. మాధవి చాలా మంచిది, ఆపైన ఎమ్ ఎ ఫైనల్ చదువుతుంది ..” అంది టూకీగా
" అబ్బబ్బ .. అవన్నీ నాకు తెలుసునుగాని, నేనడిగేది ఆ పురాణం చెప్పమని కాదులే”
"మరి ?" ఆశ్చర్యంగా చూసింది "అయితే తమకు ఏం కావాలో అడగండి చెప్తాను."
నాకు కొంచెం ధైర్యం వచ్చింది.
“అది కాదు సునీ, ఇక్కడ ఆవిడకి తల్లిదండ్రులు, బంధువులూ ఎవరూ లేరా?"
నా ఆసక్తతంతా కళ్ళల్లో పెట్టుకొని అడిగాను.
“ ఓహో ! అయితే అబ్బాయిగారికి ఆవిడ ఆటోబయోగ్రఫీ కావాలి అన్న మాట .. చెప్పక తప్పదంటావు! ”
సమాధానంగా నవ్వటానికి ప్రయత్నించాను.
సునీతకి మూడ్ కుదిరినట్లుంది చెప్పటం మొదలు పెట్టింది.
"మాధవి నేటివ్ ప్లేస్ బెజవాడ…. ఇంటర్ మీడియట్ వరకూ నేను కూడా అక్కడే చదివిన సంగతి గుర్తుందికదా ? మేమిద్దరం ఒకేచోట కలిసి చదువుకున్నాం … అప్పుడు అబ్బాయిగారు గుంటూరులో చదివే వారనుకుంటాను!”
మధ్యలో నా వూసుఎందుకులే అన్నభావంవుట్టి పడేటట్లు చూశాను.
“పాపం - మాధవికి కన్న తండ్రి ప్రేమ, ఆదరణ అనుభవించే అదృష్టం లేకపోయింది. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుంది. అప్పటిలో వాళ్ళ పినతండ్రిగారి ఇంట్లో ఉండే వారు. మాధవి పినతండ్రి అదొక రకమైన మనిషిలే, ఆయనదగ్గర వుండటం యిష్టంలేకో మరి ఎందుకోతెలియదు కాని, ఎప్పుడూ అదొకలా వుండేది. కాని మాధవిలో ఓ గొప్పతనం వుంది. ఎప్పుడూ నవ్వుతూ వుంటుంది. తను బాధ పడుతున్నా ఎదుటి వారికోసం తన బాధ మరచి పోయి మరీ నవ్వుతుంది. అప్పటికే మాధవి కథలూ అవీ రాయటం మొదలు పెట్టింది. మంచి పాటలుకూడా రాసేది. తను చాలా బాగా పాడ్తుంది కూడా. ఆ రోజులు చాలా సర్దాగా గడిచి పోయాయి. ఆ తరువాత మెడిసిన్ చేయటానికి నేను ఇక్కడికి వచ్చేశాను. ఆ సంగతి నీకు తెలుసుగా .."
“ఆ...ఆ….”తర్వాత ఏమిటన్నట్లు ఆతృతగా అన్నాను...
