-
-
వినదగు యూజీ చెప్పిన ...
Vinadagu UG Cheppina
Author: Paladugu Rajasekhar
Publisher: Paladugu Rajasekhar
Pages: 196Language: Telugu
యూజీ ఎవరో, ఏమిటో నాకు తెలీదు. గురు సౌరిస్ ‘స్నేహకుటి’లో యేటా ఆయన పుట్టినరోజు జరుపుతున్నా, స్నేహితులు ఆయన్ని చూడ్డానికి వెళ్తున్నామన్నా, ఫ్రెంచ్ మిత్రుడు పాస్కల్ మా కబుర్లలో అల్లర్లలో ఉన్నట్టుండి ‘యూజీ మీకు బాగా స్యూట్ అవుతాడు, ఆయనపై ముకుందరావు రాసిన పుస్తకం తప్పకుండా చదువ’మన్నా నాకే ఆసక్తీ కలుగలేదు యాధృచ్ఛికంగా మరో మిత్రుని ద్వారా అదే పుస్తకం నా చేతికొచ్చిందాకా. ఇన్నేళ్ళూ ఏదో అదృష్టం నన్నీ పెనుతుఫాను అంచుల్లోనే ఉంచి రక్షించిందేమో అనుకున్నా. యెందుకంటే యూజీ అంటే సమస్తం సర్వార్పణం. వదలాల్సింది గానీ, చేయాల్సింది గానీ, మారాల్సింది గానీ ఏమీ లేదంటూనే వంగిన మన నడుములపై ఘనమని అనాదిగా మోస్తున్న విలువైన మూటల్ని ఊడదీయించి ఒక్కో వజ్రాన్నీ గులకరాయిగా చూపి పారేయిస్తాడు మనతోనే. ఊత కర్రల్ని తన్నేసి ‘భయం లేదు, నిటారుగా నడువ’మంటాడు.
‘మీకే తోవా లేకుండా ఓ మూలకి నెట్టేయడమే నా పన’న్న యూజీ ఓ మెషిన్ గన్. ఎటు తిరిగితే అటు, ఏ వివక్షా, కనికరమూ లేకుండా సమస్త మతాల్నీ, సిద్థాంతాల్నీ, విశ్వాసాల్నీ, గురువుల్నీ, మానవ ఆలోచనాజనితమైన సమస్తాన్నీ, ప్రతి ‘కదలిక’నీ పేలుస్తో సాగేవి ఆయన సంభాషణలు. యూజీ 49 వ యేట (‘విపత్తు’గా యూజీ వర్ణించే) జ్ఞానోదయ స్థితి కలిగినప్పుడు ఆయనకు మరణాననుభమయ్యింది. అది అనుభవం కాదు, వ్యక్తికి సంబంధించిన సమస్తమూ ఆఖరయ్యి, అంతమయ్యి దేహంలోని ప్రతి కణమూ జీవ పరివర్తన చెందే ఈ ప్రక్రియనే అసలైన ‘మరణ’మనే వారు యూజీ. అప్పటినుండి ఆయన 89 వ యేట మన నుండి పూర్తిగా అదృశ్యులయ్యే ఆఖరి మరణం వరకూ (మనం మృత్యువు అనుకునేది అసలైన మృత్యువు కాదనీ, అది అణువులు అటూ ఇటూ మారడం మాత్రమే అనేవారు యూజీ), వివిధ కాలాల్లో వ్యక్తులతో ఆయన సాగించిన విస్ఫోటపు సంభాషణల నించి కొందరు మిత్రులు సేకరించిన శకలాలివి.
వీటి స్వచ్ఛతకూ, సూటిదనానికి అబ్బురపడి, ఈ పరమ సత్యాలకు ఎవరైనా తెలుగు చేస్తే బావుండుననుకున్నాను. ‘ఎవరో ఎందుకు? నీవే చేయ’మన్న మిత్రుల ప్రోద్బలంతో అటు తెలుగూ ఇటు ఇంగ్లీష్ ఏదీ సరిగా రాని నేను మొదలుపెట్టానీ పుస్తకాన్ని.
తాత్విక విషయాల్ని వెల్లడిరచడానికి అప్పటికే ఉన్న ఆధ్యాత్మిక పరిభాషని కాక సాధారణ పదాలతోనే స్వంత శైలిని ఇంగ్లీషులో సృష్టించుకున్నారు యూజీ. ఆయన మాటల్ని తెలుగు చేసేప్పుడు సందర్భ పరిచయం లేకుండా, ముందు వెనుకలు లేకుండా ఆ భావాల్ని తీసుకురావడం కష్టమయ్యింది. అలా చేయడంలో కొన్ని చోట్ల సఫలమయ్యాను. మరి కొన్ని చోట్ల విఫలమయ్యి ఉండవచ్చు.
- రాజశేఖర్ పాలడుగు
గమనిక: "వినదగు యూజీ చెప్పిన ..." ఈబుక్ సైజు 8.87 MB
