'సిల్వర్ స్క్రీన్' అన్న మాటని ఎవరో ఎప్పుడో తెనిగించి 'వెండితెర' అన్నారు. ఆ పేరు మీద సినిమాకి సంబంధించి వెండితెర నవలలు వచ్చాయి. 1933లో వచ్చిన 'సావిత్రి' (ఈస్టిండియా: సి. పుల్లయ్య) నుంచి, సినిమాకి పాటల పుస్తకాలు వచ్చాయి. చిన్న ఎక్కాల పుస్తకం సైజులో. దాని వెల కాణి. కాణి అంటే రూపాయిలో 64వ వంతు. ఆ పుస్తకాలు సినిమాలు ఆడే హాళ్ళలో అమ్మేవారు. ఆ పుస్తకాల్లో పాటలు, పద్యాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లూ ఉండేవి. పాటలు పాడగలిగే వాళ్ళు ఆ పుస్తకం కొనుక్కుంటే పాటలు, పద్యాలు పాడుకోవడానికి అనుకూలంగా ఉండేది. 1934లో ఈస్టిండియా 'లవకుశ' వచ్చింది. ఇది తెలుగులో తొలి సూపర్ హిట్ సినిమా. ఈ సినిమా పాటల పుస్తకం పెద్ద సైజులో వేశారు. అట్ట మీద బొమ్మ రంగుల్లో. లోపల అక్కడా అక్కడా బొమ్మలు. పాట మీద రాగం, తాళం రాసేవారు. ఈ పుస్తకం వెల అణా. అలా ప్రతి సినిమా పాటల పుస్తకాలు వెలువరించింది. సినిమా మీద ఉత్సాహం ఉన్న వాళ్ళు ఆ పాటల పుస్తకాలు భద్రంగా ఉంచేవారు. భావితరాల వాళ్ళకు ఉపయోగపడేలా ఉండాలన్న ఉద్దేశం కూడా ఉంది.
క్రమేణా కొన్ని సినిమాలకి పాటల పుస్తకాలు రావడం తగ్గింది. 'వెండితెర నవల' అన్న పేరుతో, సంభాషణలు, దృశ్యాలు, పాటలతో మొత్తం సినిమా నవలలాగా రావడం ఆరంభమైంది. ఈ ఆలోచన తొలిసారిగా అన్నపూర్ణ అధినేత దుక్కిపాటి మధుసూదనరావుకి వచ్చింది. 'తోడికోడళ్ళు’ (1957) తొలి వెండితెర నవల. రామ్చంద్ రాశారు. ఆయన దిన పత్రికల్లో పనిచేసేవారు. కొన్ని సినిమాలకి కథలు అందించారు. ఈ ఆలోచనకు కారణం - తమిళ సినిమా. అప్పట్లో వచ్చిన తమిళ సినిమాలకి వెండితెర నవలలు వచ్చాయి. వాళ్ళు ఏం పేరు పెట్టారో గుర్తులేదు. వాటివల్ల సినిమాకు పబ్లిసిటీ అవుతుందని, కథ, మాటలు చదువుకోవడంతో విలువ పెరుగుతుందనీ భావించారు. అంచేత, తెలుగు వెండితెర నవలకు, తమిళ సినిమా ప్రేరణ. ఐతే పాటల పుస్తకాల్లాగా ఈ నవలలు సినిమా హాల్సులో అమ్మలేదు. బయట అమ్మేవారు. డిస్ట్రిబ్యూటర్లు పబ్లిసిటీలో భాగంగా ఎంచి, నవలలకు ప్రకటనలు ఇచ్చేవారు. దాదాపు అన్ని నవలలూ అమ్ముడుపోయేవి. సాహిత్యపరంగా, పాటలు, డైలాగులు ఉన్నవి మలి ప్రచురణలకి నోచుకున్నాయి. ఒక సినిమా గురించి, ఆ నటీనటులు, టెక్నీషియన్ల గురించి సాధికారికంగా తెలుసుకోవడానికి ఈ నవలలు ఎంతో ఉపయోగపడ్డాయి.
డిస్ట్రిబ్యూషన్ శాఖ అంతరించిపోయి, సినిమాలు అమ్మకాల పాలు కావడంతో, వెండితెర నవలలు అస్తమించాయి. ఈ పుస్తకం ఖర్చు ఎవరు భరిస్తారు? అమ్మేసుకున్న తర్వాత నిర్మాతకు సినిమాతో పనిలేదు. కొనుక్కున్న వాడికి అనవసరం!
శ్రీ పులగం చిన్నారాయణ, శ్రీ వడ్డి ఓంప్రకాశ్ నారాయణ - ఇద్దరూ చెయ్యి తిరిగిన జర్నలిస్టులు. సినిమా మీద మంచి పట్టు, అవగాహనా ఉన్నవాళ్ళు. ఈ నారాయణ ద్వయం వెండితెర నవలల మీద పరిశోధన ప్రారంభించి, 'వెండి చందమామలు' పేరుతో పుస్తకం తీసుకొచ్చారు. ఈ పుస్తకం చాలా వివరాలు అందించింది. ఏ ఏ సినిమాలకి వెండితెర నవలలు వచ్చాయి? ఎవరెవరు రాశారు? అన్న వివరాలు చదివితే, ఆశ్చర్యం వేసింది. చాలా సినిమాలకు నవలలు వచ్చినట్టు తెలియదు. ఈ జంట చేసిన పరిశోధన గొప్పది. ఇంతే కాకుండా నవలలు రాసిన వారు చెప్పిన మాటలు కూడా ప్రచురించారు. సంవత్సరం వారీగా జాబితా కూడా ఇచ్చారు. వెండితెర నవలల చరిత్ర తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళకే కాదు - సినిమా ఉత్సాహం ఉన్న అందరికీ - ఈ పుస్తకం మంచి ‘విషయం’ అందిస్తుంది. వారి పరిశోధనకు అభినందనలు.
- రావి కొండలరావు
గమనిక: " వెండి చందమామలు " ఈబుక్ సైజు 5.4mb