-
-
వేమన్న వెలుగులు
Vemanna Velugulu
Author: Dr. N. Gopi
Publisher: Shanta Vasantha Trust
Pages: 510Language: Telugu
వేమన ఒక తాత్త్విక విజ్ఞాన సర్వస్వం, సకల సామాజికానుభవ స్వారస్యం. వేమన పద్యాలు తెలుగులో ఉండటం వల్ల ఆ తెలుగు మన మాతృభాష అయినందుకు నేనెంతో గర్విస్తున్నాను. రాతిబాటల్లో జాతిరత్నాలు వెదజల్లిన అపురూపమైన మహాకవి వేమన, నీతుల నీరనిధులు పొంగించిన సామాజిక ప్రవక్త. సుదీర్ఘ రోగానికి చేదు మందులిచ్చే వైద్యుడిగా, తీరాన్ని గానం చేసే నావికుడిగా వేమన మనకు సాక్షాత్కరిస్తాడు.
వేమన పద్యాలతో, సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధంలో 10, ఆగస్టు 2008 న ప్రారంభమైన 'వేమన్న వెలుగులు' శీర్షిక 28 ఆగస్టు 2011 సంచికతో ముగిసింది. అంటే మూడేళ్లపాటు నిర్విరామంగా నడిచింది. వేమన పద్యాలను గురించిన ఏ వ్యాసంగానికైనా ముగింపు ఉంటుందని నేననుకోను. అది అనంతమైన సముద్రం. కడవను బట్టి నీళ్లు.
దాదాపు పదకొండు వందల రోజులు వేమన్న వెలుగులు తెలుగు వాకిళ్లలో ముగ్గులై పూశాయి. వేలాదిమంది పాఠకులను అలరించాయి. ఏ ఊరు వెళ్లినా వేమన్న వెలుగుల ఊసే. విద్యాలయాల్లో తెలుగుకు వెలుగు తగ్గుతున్నదని ఎందరో వాపోతున్న రోజుల్లో ఆ శీర్షిక కోసం ఉపాధ్యాయులూ, విద్యార్థులూ ప్రతివారం ఎదురుచూస్తున్నారని తెలిసి ఎంతో ఉత్సాహం పొందాను. దానికి కారణం వేమన్న గొప్పతనమే. నాలుగు దశాబ్దాలుగా వేమన్నను వ్యాసంగంగా చేసుకున్న క్రమంలో నాకర్థమైందేమిటంటే వేమన్నలాంటి కవి ప్రపంచసాహిత్యంలోనే అరుదని.
ఈ గ్రంథంలో 428 పద్యాలకు వ్యాఖ్యానం రాశాను. ఇవి జాగ్రత్తగా ఎంపిక చేసిన పద్యాలు. వేమన్న మూడువేల పద్యాలలోని ముఖ్యమైన భావాలన్నింటికీ ప్రాతినిధ్యం వహించే పద్యాలు వీటిలో ఉన్నాయి. ఆ రకంగా వేమన్న భావజాల సమగ్రతను దృష్టిలో పెట్టుకున్న సంకలనమిది.
- ఆచార్య ఎన్. గోపి
