-
-
వేకువ రాగం
Vekuva Raagam
Author: Dr. Putla Hemalatha
Publisher: Vihana Electronic and Print Media
Pages: 80Language: Telugu
ఈ శీకర మేఘాల ప్రవాహం
ఏ తీరం నుంచి కొట్టుకొచ్చిందో కదా !
నేననుకుంటూనే వున్నాను
ఏ క్షణమో ఇలా అవుతుందని ....
ఒక అర్దరాత్రి
నెమలి పించాన్ని బుగ్గలకి రాస్తూ
శీతల తెమ్మెరల్ని గానం చేస్తూ
హృదయపు తటాకాన్ని సడిచేస్తావని !
తలపుల వాకిట్లో
టిక్కు టిక్కున కొట్టే లకుముకి
కాగితపు ముక్కల మధ్య
సిల్వర్ ఫిష్ అవుతుంది
కరుగుతున్న దీపకాంతి
కాల చక్రానికి కందెనవుతుంది
నీ వెచ్చని జ్ఞాపకమేదో
ఆచ్చాదన లేని పాదాల కొసన
మించు మకుటమవుతుంది
ఇదిగో ....
ఈ వేకువ పిల్లగాలులూ ...
రాత్రంతా సొద పెట్టీ పెట్టీ
అలిసిపోయిన కీచురాళ్ల గుంపూ
ఒక్కో మెట్టూ జారుతున్న చంద్రుడూ
నీకు ఆరోపించిన మెచ్చుకోళ్లు
రాత్రి రాలిన మనోరంజి పూల సువాసనలై
కలత నిద్రని చెడగొడుతున్నాయి
చీకటి వెన్నెల తెరతీసి
తోటలో కెళ్లా!
నిన్న రాత్రి వర్షం వెలిశాక
విరిగిపడ్డ ఇంద్రధనుస్సు ముక్కల్ని
తొలి వేకువ మంచులో ఏరుకుంటున్నాను
