-
-
వాత్సాయన కామసూత్రాలు - మోహన్ పబ్లికేషన్స్
Vatsyayana Kamasutralu Mohan Publicatons
Author: Sridhara Srirama Krishna
Publisher: Mohan Publications
Pages: 167Language: Telugu
ఏడు అధికరణాలుగల ఈ కామసూత్రంలో మొదటిది సాధికాధికరణం. దీన్ని వాత్స్యాయనుడు ఐదు ప్రకరణాలుగా విభజించాడు. ఈ ఐదింటిలో మొదటిదైన సంగ్రహంలో శాస్త్రంలో చెప్పే విషయాలు సంగ్రహంగా వివరింపబడ్డాయి. రెండవదైన త్రివర్గప్రతిపత్తిలో ధర్మార్థ కామాలను ఎలా సేవించాలో చెప్పబడింది. మూడవదైన విద్యా సముద్దేశంలో నాట్యము, సంగీతంవంటి కళల స్వరూపాలు, వాటి సాధన మార్గాలు, వాటికెట్టివారు అధికారులో చర్చించబడింది. నాల్గవదైన నాగరిక వృత్తంలో నగరంలో నివసించే వారైన నాగరీకుల ప్రవర్తన గురించి చెప్పబడింది. ఇక ఐదవదైన నాయక సహాయ దూతీ కర్మ విమర్శలో నాయకా నాయికలకు సహాయపడే దూతిక (దూతకు స్త్రీలింగం)ల గురించి వ్రాయబడి ఉంది. ఇలా విషయానికి తగినట్టుగా ఆ ప్రకరణాలకు పేర్లు పెట్టాడు శాస్త్రకారుడు.
రెండవ అధికరణం సాంప్రయోగికం. పది అధ్యాయాలూ, పదిహేడు ప్రకరణాలు ఇందులో ఉన్నాయి. స్త్రీ పురుషుల అంగప్రమాణం, స్కలనమయ్యే సమయం స్త్రీ పురుషులలో భావ ప్రాప్తి రతావస్థాపనాధ్యాయంలో వర్ణింపబడ్డాయి. కౌగిలింతలు, ముద్దులు, గోళ్ళ నొక్కులు, పంటి నొక్కులు, సంభోగానికి స్త్రీ పురుషులిద్దరినీ సిద్ధపరచటం, ఉపరతి, రతారంభం, రతి సమాప్తి, రతి గతి విశేషాలు, ప్రణయకలహాలూ ఈ అధికరణంలో వాత్స్యాయనుడు వివరించాడు.
మూడవ అధికరణమైన కన్యా సంప్రయుక్తకంలో ఐదు అధ్యాయములు, తొమ్మిది ప్రకరణములు ఉన్నాయి. వివాహము చేసుకొనుటలో అవలంభించే విధానాలు, సంబంధములు గురించిన నిర్ణయాలు, భార్యలను వశపరచుకొనే ఉపాయాలు, బాలలను పొందాలంటే హృదయాభిప్రాయాలను సూచించే రీతులు, కనుసైగలతో ప్రియుణ్ణి మళ్ళింపజేసేవిధానాలు, సేవకు వాళ్ళద్వారా కన్యను పొందేటటువంటి మార్గాలూ ఇందులో వ్రాయబడి ఉన్నాయి.
పురుషుని వివాహం చేసుకున్నప్పట్నుంచీ కన్య 'భార్య'గా పిలవబడుతుంది. 'భార్య'ను గురించి చెప్పేది భార్యాధికరణం. ఇందులో రెండు అధ్యాయాలు ఎనిమిది ప్రకరణాలు ఉన్నాయి. ఒక భర్త అధీనంలోనే ఉన్న భార్యను 'ఏకచారిణి' అంటారు. ఏకచారిణి నడుచుకోవల్సిన విధానం, భర్త దూరంగా ఉన్నప్పుడు అవలంబించాల్సిన విధానాలు, ఒక పురుషునికి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలున్నప్పుడు వారిలో పెద్ద భార్య అవలంభించాల్సిన విధానం, చిన్న భార్య నడుచుకోవల్సిన రీతి-రివాజులు, రెండో పెళ్ళి చేసుకున్న స్త్రీ, గయ్యాళి అవటం మూలంగా భర్తచే వదిలివేయబడ్డ స్త్రీ, అంతఃపుర స్త్రీల యొక్క నడవడికలు, వారి పట్ల పురుషుడు ఎలా నడుచుకోవాలి అన్న విషయాలు ఇందులో వివరింపబడ్డాయి.
ఇతరుల భార్యలతో సంగమించే విషయములను వివరించేది ఈ ఐదవదైన పారదారికాధికరణం. దీనిలో ఆరు అధ్యాయములు, పది ప్రకరణములు ఉన్నాయి. స్త్రీ పురుషుల శీలంగురించి, స్త్రీ రతి విషయంలో వెనుకంజ వేయడానికి గల కారణాలను గురించి, స్త్రీల విషయంలో ఉత్సుకతచూపే పురుషుల గురించి, ప్రయత్నం లేకుండానే లొంగే స్త్రీల గురించి మొదటిది అధ్యాయంలోనూ, స్త్రీ పురుషుల పరిచయాలు ఎలా జరిగేదీ, ఒకరిపట్ల మరొకరు ఉత్సాహాన్ని ఎలా చూపించేదీ రెండో దానిలోనూ, స్వభావాన్ని పరీక్షించటం మూడో దానిలోనూ, దూతిక చేసే పనులు నాల్గవ దాని లోనూ, ఈశ్వర కామితం గురించి ఐదవ దానిలోనూ, అంతఃపుర స్త్రీల రక్షణ గురించి ఆరవ అధ్యాయం లోనూ వివరింపబడ్డాయి.
ఆరవ అధికరణమైన వైశికంలో ఆరు అధ్యాయాలు, పన్నెండు ప్రకరణాలు ఉన్నాయి. వేశ్యల వలన దొరికే సుఖం గురించి ఇందులో వివరింపబడింది. వేశ్యల దగ్గరకు వెళ్ళడానికి సాయపడే వారి గురించి, వేశ్య సంపర్కం పొందదగిన, దగని పురుషుల గురించి, వేశ్యలవిధేయత గురించి, డబ్బు సంపాదించే ఉపాయాల గురించి స్త్రీ విరక్తి కలిగిన వారిని గుర్తించటం గురించి, వియోగం పొందిన వారిని కలపటం గురించి పై ఆరు అధ్యాయాల్లోనూ వివరింపబడింది.
ఈ శాస్త్రంలో ఆఖరిదైనది. ఏడవది అయిన ఔపనిషదికాధికరణంలో రెండు అధ్యాయాలూ, ఆరు ప్రకరణాలూ ఉన్నాయి. ఏ ఉపాయం ద్వారానూ కామాన్ని పొంద కుదరకపోతే ఏ ఔషధాలు, ఎలా ఉపయోగించాలి, నష్టపోయిన కామాన్ని తిరిగి ఎలా పొందాలి, కామవృద్ధికోసం ఎలాంటి యోగ ప్రక్రియలున్నాయి, పోగొట్టుకున్న ప్రేమానురాగాలు ఎలా తిరిగి పొందాలి దానిని ఎలా వృద్ధి చేసుకోవాలి లాంటివి ఈ రెండు అధ్యాయాలలోనూ చెప్పబడ్డాయి. ఇలా వాత్స్యాయన కామ సూత్రాలు ముప్ష్పె ఆరు అధ్యాయాలను, అరవై నాలుగు ప్రకరణాలను, ఏడు అధికరణాలను, వెయ్యి శ్లోకాలను కలిగి ఉంది.
ఇది వాత్స్యాయన కామ సూత్రాల్లో ప్రథమాధికరణంలోని శాస్త్ర సంగ్రహం అనే మొదటి అధ్యాయం.

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE