-
-
ఉత్తరాంధ్ర కథాస్థానీయత
Uttarandhra Katha Sthaneeyata
Author: Dr. Malleeswari
Publisher: Mitra Sahiti
Pages: 74Language: Telugu
ఉత్తరాంధ్ర కథ పుట్టి వందేళ్ళు దాటింది. గురజాడ, చాసో, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, భూషణం, పతంజలి లాంటి దీపధారులయిన కథారచయితలంతా స్థానిక కథా వస్తువులు, స్థానికనేపధ్యం, ఉత్తరాంధ్రలోని భిన్నమాండలికాల ద్వారా అపురూపమయిన కథలు రాసారు. స్థానిక వ్యక్తీకరణ బలంగా ఉండటం మూలంగా ఆ కథలు ఉత్తరాంధ్ర కథలుగానే కాక సర్వజన ప్రాసంగికతని పొంది ప్రధాన స్రవంతి కథలుగా కూడా సార్వత్రికతని సాధించాయి.
అస్తిత్వ ఉద్యమాల రాకతో సాహిత్యంలో సూక్ష్మమైన అంశాలను వాటి ఉనికి ఆధారంగా గుర్తించి మాటాడ్లటం మెుదలయింది. స్థానికత రాజకీయ ప్రతిపత్తిని సాధించి ప్రాంతీయత అయింది. ప్రాంతీయ ఉద్యమాల ప్రభావంతో స్థానికాంశాలన్నీ పునర్నిర్వచనాన్ని పొందుతున్నాయి. తమ ప్రాంతం, తమ సంస్కృతి, తమ భాష, యాసలు, తమ ఆచార వ్యవహారాలను ఆత్మగౌరవ పరిధిలోంచి చూడటం వలన స్థానీయత కొత్తశక్తిని పుంజుకుంది. ప్రపంచీకరణకి విరుగుడు స్థానికతేనన్న వాదనా జోరందుకుంది. ఈ నేపధ్యాన్ని అధ్యయనం చేసే క్రమంలో వర్తమాన ఉత్తరాంధ్ర కథలలోని స్థానీయమైన అంశాలను కూడా తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది.
1980ల తర్వాత ఉత్తరాంధ్రలో విస్తృతంగా కథలు రాస్తున్న వారిలో, వారి స్థానిక అస్తిత్వ స్పృహ ఆధారంగా ఆరుగురు కథకులని ఎంపిక చేసుకుని వారి సమగ్ర సాహిత్యాన్ని చదివాను. దీనివలన వారి పరిణామక్రమాన్ని వ్యాఖ్యానించడం నాకు సులువు అయింది. అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు, బమ్మిడి జగదీశ్వరరావు, సువర్ణముఖి, చింతా అప్పలనాయుడు, మల్లిపురం జగదీష్ల కథా సాహిత్యంలోని స్థానికతా విశేషాలను చినుకు సాహిత్య మాసపత్రికలో ‘కథా స్థానీయత’ శీర్షికన వరుస వ్యాసాలుగా రాసాను.
ఉత్తరాంధ్ర కథా సాహిత్యంలోని స్థానికతా విశేషాలను వెలికితీసే ఈ చిరుప్రయత్నాన్ని నేను శ్రద్ధగానూ, బాధ్యతగానూ, ప్రేమగానూ చేశాను. వ్యంగ్యం, విలక్షణత, నిష్కాపట్యం, జానపదతత్వం, జవజీవాలు కలిగిన మాండలికంతో ఎలాంటి సాహిత్యకారుడినైనా యిట్టే ఆకర్షించే ఉత్తరాంధ్ర జనజీవితానికి మరీ మరీ కృతజ్ఞతలు.
- మల్లీశ్వరి
