-
-
ఉగ్గుపాలు
Uggupalu
Author: Bhoopal Reddy
Publisher: Self Published on Kinige
Pages: 190Language: Telugu
ఈ కథలు పిల్లల దుఃఖాల్నీ, ఆనందాల్నీ పరిశీలించి రాసినట్టుగా ఉండవు. పిల్లల్లో ఒకడై వాళ్లతో ఆడిపాడి అలర్లి చేసి రాసినట్టుగా ఉంటాయి. అందుకే మన మనసులకు మెత్తగా తాకుతాయి. పిల్లల అమాయకత్వంలోనే కరుణాతరంగం దాగి ఉందని చెబుతాయి. పెద్దల కష్టాల్ని చూసి కరిగిపోయే లక్షణం పిల్లల్లోనూ ఉంటుంది. ఈ పుస్తకంలోని చాలా కథల్లో ఇది కనిపిస్తుంది. పిల్లల చిన్ని చిన్ని బెంగలు, దిగుళ్లు, అమాయకపు మాటలు శిశు హృదయంతో ఆవిష్కరించారు రచయిత ‘భూపాల్ రెడ్డి’గారు.
పిల్లల ప్రవర్తన, ఆలోచన, అంతరంగం ఏ తీరున ఉంటుందో, పెద్దల ప్రవర్తన, మాటలు వాళ్లని ఏ దిశగా నడిపిస్తాయో ఈ కథలు చదివితే తెలుస్తుంది. వారి సున్నిత హృదయాలపై చిన్నప్పుడే గాఢమైన ముద్రలు పతాయి. పిల్లలతో పెద్దలు ముఖ్యంగా తల్లిదండ్రులు సున్నితంగా వ్యవహరిస్తారా, మొరటుగా ప్రవర్తిస్తారా అన్నదాన్ని బట్టి వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సామాజిక ప్రభావాలు, టీవీ ప్రభావాలు ఉండకపోవు. కానీ శైశవ దశలో తల్లిదండ్రుల పెంపకం, స్పందించే తీరును బట్టి పిల్లల్లో కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఏర్పడతాయి. అవి తర్వాతి దశలో వారి జీవన గమనాన్ని ప్రభావితం చేస్తాయి. కనుక పిల్లల మనసెరిగి ప్రవర్తించడాన్ని తల్లిదండ్రులు నేర్చుకోవాలి. భూపాల్ కథలు చదివితే ఈ విషయం మనకు తెలియకుండనే స్ఫురిస్తుంది. మన ఇంట్లోనూ, మిత్రుల ఇళ్లలోనూ పిల్లల్ని చూస్తుంటాం. వారి హావభావాలు, మాట్లాడే తీరు గమనిస్తుంటాం. ఇదంతా యథాలాపంగా సాగుతుంది. కానీ ఈ కథలు చదువుతున్నపుడు పిల్లల ప్రపంచాన్ని మళ్లీ కొత్తగా దర్శిస్తున్న అనుభూతి కలుగుతుంది. మనం చాలాసార్లు చూస్తూ కూడా పట్టించుకోని అనేక సూక్ష్మ విషయాల్లోని గాఢత ఈ కథలు చదివినప్పుడు అనుభవంలోకి వస్తుంది.
