అక్కడికి వెళితే ఆకలి తీర్చుకోవటంతోపాటు పనిలోపనిగా ఖలీల్ పాషాని గురించి ఎంక్వయిరీ చేయవచ్చుననుకుంటూ వున్నచోటునుండి కదలబోయాడు శ్యామ్సుందర్.
అడుగు వేయాలని అతను ఎత్తిన పాదం ముందుకు పడలేదు. ఉన్నచోటునుండి అంగుళం కూడ కదల్లేదు అతను.
''మైగాడ్!మళ్ళీ ఏమైంది తన కాళ్ళకి? ఎందుకు కదలనంటున్నాయి అవి? అతిగా ఎగరటంవల్ల, పరుగులుదీయటంవల్ల తనకే తెలియనంత నీరసం ఆవరించుకుందా తన శరీరాన్ని? కాలు కదపలేనంత బలహీనుడైపోయాడా తను? విపరీతమైన ఆశ్చర్యానికి గురి అవుతూ తనను తానే ప్రశ్నించుకున్నాడు శ్యామ్సుందర్.
అదేసమయంలో మోయలేని బరువేదో భుజంమీద పడినట్టు ఫీలవుతూ భుజం మీదుగా తలత్రిప్పి వెనక్కి చూశాడు. చూసిన తరువాత ఉలికిపడకుండా వుండలేకపోయాడు.
''పనీ పాటా లేకుండా ఫకీరులా తిరుగుతున్న నన్ను చేరదీసి ఆదరించింది చాందినీ బహెన్. ఆకలిదప్పులతో అలమటించిపోతున్న నాకు ఇంత తిండిపెట్టి ఇంతటివాడ్ని చేసింది. అటువంటి పుణ్యాత్మురాలు కంట తడిపెట్టడం నేను చూడలేను. ఆమె కోరితే ప్రాణాలు ఇవ్వటానికైనా వెనుకాడను.''
కరకరలాడుతున్న కంఠంతో బల్బీర్ అన్న మాటలకు మౌనంగా తలాడించాడు శ్యామ్సుందర్.
మనసులోని ఆందోళన ముఖంలో తెలీకుండా జాగ్రత్తపడుతూ చిరునవ్వును బలవంతంగా పెదవులమీదికి తెచ్చుకున్నాడు.
