-
-
తూర్పు బడి... పడమర గుడి...
Turpu Badi Padamara Gudi
Author: Kalasapudi Srinivasa Rao
Publisher: Vanguri Foundation of America
Pages: 112Language: Telugu
"అవును నాకు తెలుసు, ఇండియా వెళ్ళాలని నాన్నగారి ఉద్దేశం. ఆయన వెళ్ళి అక్కడ చేయగల్గింది ఏమిటని నా ప్రశ్న. ప్రస్తుతం అంతా వ్యాపారమయం. ఆ బడి మీద డబ్బు పెడితే ఒక్క పైసా వెనక్కి రాదని అందరికీ తెలుసు. బడి మూసేసి ప్రైవేటు స్కూల్ తెరిస్తే మరింత మంది స్టూడెంట్లు వస్తారు. డబ్బు చేసుకోవచ్చని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈయన వెళ్ళి వాళ్ళని మార్చగలరా? ఈయన, నాయుడు మాస్టారు, విశ్వనాధం మాస్టారు ముగ్గురూ కలిసి స్కూలు గోడలు పడిపోకుండా నిలపాలని ప్రయత్నించినా దానికి కావల్సిన డబ్బు ఎక్కడ నుండి తెస్తారు? ఇన్నేళ్ళు శ్రమపడ్దారు. రిటైరయ్యారు కదా! హాయిగా రామా.. కృష్ణా... అనుకుంటూ గడిపెయ్యక ఈ వయస్సులో ఇంత పెద్ద పనులు నెత్తిన వేసుకుంటే చెయ్యగలరా?" అన్నాడు శంకరం.
"చెయ్యగలనో లేదో నాకు తెలియదు కానీ ఏమీ చెయ్యకుండా ఉండలేను రా..." అన్నారు వెనకనుండి అప్పుడే అక్కడకు వచ్చిన భద్రాచలంగారు. శంకరం, శారదమ్మగారు, సోఫీ తుళ్ళిపడ్దారు ఆయన మాటలు విని. శంకరం తేరుకొని
"అది కాదు నాన్నా... మీరు..."
"నిజమే శంకరం, నేను ఇక్కడ మీతో అమెరికాలోనే ఉండడం నలుగురికీ, నీకు, నాకు కూడా సబబుగానే తోస్తుంది. నాకు తెలియకుండానే నేను ఆ స్కూలులో ఒక భాగం అయిపోయాను. కాలం ఎల్లకాలం ఒక్కలా ఉండకపోవచ్చు, కాలం మారినా మనిషి మారడం అంత సులభం కాదురా! అయినా తాపీగా ఆలోచిద్దాం, మీకు ఆలస్యం అవుతున్నది పార్టీకి, వెళ్ళిరండి."
