“అతను రాజూమియా కాదు.”
“ఎవరు? రాజూమియా కాకపోతే మరి ఎవరు?” విపరీతమైన ఆందోళన ఒక్కసారిగా వచ్చి ఆవరించుకోగా తడబడుతూ అడిగాడు ఇజాకీ.
గాఢంగా నిట్టూర్చి సమాధానం ఇచ్చాడు ఫ్యూజీశాన్.
"ఈ కుంగ్ ఫూ మాస్టర్ ఫ్యూజీశాన్ పన్నిన రెడ్ రిబ్బన్ని ఛేదించే శక్తి ఈ ప్రపంచంలో మరో యిద్దరికే వుంది. నాకు ఈ విద్యను దానం చేసిన నా గురుదేవుడికి, నా తరువాత ఆయనకు ముద్దు శిష్యుడైన సీక్రెట్ ఏజెంట్ షాడోకి తప్ప మరెవ్వరికీ తెలియదీ రహస్యం.”
షాడో పేరు వినగానే కరెంట్ షాక్ కొట్టినట్లు అదిరిపడ్డాడు ఇజాకీ.
"షాడో! సీక్రెట్ ఏజెంట్ షాడో కైరో లో ప్రవేశించాడా? కైరోను చుట్టుముట్టి కాపలా కాస్తున్న సుప్రీమ్ కమాండ్ స్పెషల్ ఫోర్సును దాటి లోపలికి ఎలా రాగలిగాడు ? వెంటనే యీ విషయాన్ని సుప్రీమ్ కమాండ్కి తెలియచేయాలి..... వెంటనే ….” గిర్రున వెనుతిరిగి తన కారు దగ్గరికి పరుగు తీశాడు ఇజాకీ.
"ఆగు.... తొందరపడకు... ఇజాకీ.... ఆగు...” హెచ్చరించాడు ఫ్యూజీశాన్.
"వచ్చింది షాడో అని తెలిసిన తర్వాత యిక నా మాట ఎందుకు వింటాను ఓల్డ్ మాన్! నువ్వు నీ కుంగ్ ఫూ పోయి నైలు నదిలో పడి చావండి.... షాడోని కొట్టాలంటే చేతులు కాదు కావాల్సింది, బాంబులు, సూపర్ సోనిక్ విమానాలలో వెయ్యి పౌండ్ల బాంబుల్ని నింపి, తీసుకుపోయి అతని నెత్తిమీద పడేయాలి....” అనుకుంటూ కారును వేగంగా ముందుకు దూకించాడు ఇజాకీ.
