తనను పట్టుకోవటానికి ప్రయత్నించిన సి.ఐ.డీ.లు యిద్దర్నీ కొండ గుట్టల చుట్టూ తిప్పి ఒక కొండ చెరియలో వారికి స్లిప్ యిచ్చేశాడు మున్నా. చుట్టు దారిన ఉకురూ చాచా యింటికి చేరుకునేసరికి, దూరంలో అతనికి కనిపించారు షాడో, గంగారాంలను బంధించి తీసుకుపోతున్న ఫెర్నాండజ్ అనుచరులు.
రగులుతున్న గుండెలతో, పగబట్టిన పాములా వారిని అనుసరించాడు మున్నా. తన తండ్రి వ్రాసిన రెండే రెండు వాక్యాలను చదివి తమ కష్టాల్లో పాలు పంచుకోవటానికి వచ్చాడు షాడో. చీమల పుట్ట మీది నుంచి తనను కాపాడి ప్రాణదానం చేశాడు. అటువంటి వ్యక్తికి సహాయం చేయలేకపోతే తన జన్మ దేనికి?
తన నాయనే గనుక బ్రతికి వుంటే షాడో సాబ్ వంటి మీద చెయ్యి వెయ్యగలిగే వాళ్ళా ఆ సి.ఐ.డీలు? అసలు అతన్ని పట్టుకొని ప్రాణాలతో అవతలికి పోగలిగే వాళ్ళా??
మున్నా టైగర్ తనను అనుసరిస్తున్నట్లు తెలియని ఫెర్నాండజ్ అనుచరులు సూటిగా ముందుకే సాగిపోయారు. చీకట్లు సురుటీ కొండల్ని చుట్టు ముడుతుండగా ఒక పల్లపు ప్రదేశంలో వారిని ఆగమని హెచ్చరించాడు ఫెర్నాండజ్. షాడో గంగారాంలను పల్లపు ప్రదేశం మధ్యలో కూర్చోబెట్టి, వారి ముందు పెద్ద చితుకుల మంట వేశారు అతని అనుచరులు. ఆ మంట చుట్టూ రౌండ్గా కూర్చుని వెంట తెచ్చుకొన్న ఎండురొట్టెల్ని ఆరగించటం ప్రారంభించారు.
