-
-
తెలుగు వల్ల ఒరిగేదేమిటి?
Telugu Valla Origedemiti
Author: belide veerashankaru
Publisher: Self Published on Kinige
Pages: 12Language: Telugu
మనకు స్వాతంత్ర్యాన్ని అహింసయే ఆయుధంగా చేసి సాధించిన మహాత్మాగాంధీ తన ప్రసంగాలలో, ముఖ్య రచనల్లోనూ, స్వతంత్ర భారతదేశంలో ప్రజల భాషలోనే పాలన జరగాలి. అదియే దేశ సత్వర అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. మరిప్పటి స్వతంత్ర భారతదేశంలో దేశ భాషలగతి ఏమిటి? ఇంగ్లీషు జాఢ్యాన్ని మనం ఇంకా వదిలించుకోలేక పోవుచున్నాము. దేశంలోని మిగతా రాష్ట్రాలు కొంత వరకు నయం ఎందుకంటే, లిపి భాషా సాహిత్యం లేని ఈశాన్య గిరిజన రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలన్ని తమ తమ ప్రాంతీయ భాషల్లోనే జరుపుకుంటున్నారు. మరి మన రాష్ట్రం సంగతేమిటో చూడండి? స్వాతంత్ర్యం వచ్చి 60 సంవత్సరాలైనా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇంగ్లీషే రాజ్యమేలుతోంది. తెలుగువాడుక నామమాత్రమే. ఇది ఏమి అన్యాయం. మన తెలుగువారు ముఖ్యమంత్రి నుంచి గిరిజన గ్రామాల్లో నివసించే ప్రజలందరూ ఇంగ్లీషు పండితులా? తెలుగుకన్నా ఇంగ్లీషే బాగా వచ్చని అనుకుంటున్నారా? ఇలాంటి పిచ్చి వ్యామోహంతో ఒక కార్యాలయానికి వెళ్ళి అధికారుల ముందు చేతులు కట్టుకుని నిలబడి, వాళ్ళకు లంచాలిచ్చి, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టి ఇంగ్లీషులో పత్రాలు తీసుకుని ఆహా! నాకు కూడా ఇంగ్లీషు వచ్చని మురిసిపోవడమేనా అభివృద్ధి? ప్రజలకు నిత్యావసర రేషను కార్డులు, నీటి బిల్లులు, విద్యుత్తు బిల్లులో దానికి సంబంధించిన నిబంధనలు, సూచనలు తమకర్థం కావని, అవి తెలుగులో ఉండాలని ఒక్కడూ నిలదీయడేమిటి? ఇంగ్లీషులో కాగితం పట్టుకోవడంతోటే ఇంగ్లీషు వచ్చినంత సంబరపడే తెలుగు జాతి తమను తామే మోసం చేసుకొని అధోగతి పాలవుతున్నది. నిజానికి ఈ రాష్ట్రంలో ఇంగ్లీషులో చదువుకొని, వ్రాయగలిగి, అర్థం చేసుకోగలిగిన వాళ్ళు 15% మంది కూడా లేరు. మరిలాంటప్పుడు, ఈ 85% మంది ప్రజలు ప్రభుత్వాన్ని తమకు కావాల్సినవన్నీ తెలుగులోకి ఇవ్వాలని ఎందుకు పోరాటం చేయడం లేదు? అయినా, సరే…ఓ.కే. అనుకుందాం. ఇంగ్లీషులో చదువుకుని విదేశాలకు వెళ్లేవారు 2% మరియు ఇతర రాష్ట్రాలలో ఉద్యోగాలు చేసేవారు మరో 3% మంది ఉంటారని సమాచారం. మరి మిగతా 95% మంది తెలుగు ప్రజలు రాష్ట్రంలోనే నివసించేవారు కదా! మరి వీరందరికి తెలుగు పాలన అవసరం లేదా? ఇలాగే ఇంగ్లీషే గొప్పదని ఊహాలోకాల్లో విహరించి కాళ్ల క్రింద గోతులు పడుతుంటే కూడా పట్టించుకోనవసరం లేదా? ఆలోచించండి.
