-
-
తెలుగు కథానికకు వందేళ్ళు
Telugu Kathanikaku Vandellu
Author: Dr. Vedagiri Rambabu
Publisher: Sri Vedagiri Communications
Pages: 180Language: Telugu
తెలుగు భాష, సాహిత్యాల మీద క్రమక్రమంగా ఆదరణ తగ్గుతోందేమోననే అనుమానం చాలామందికి వచ్చినట్లే నాకూ వచ్చింది. దగ్గరలో కథానికా శతజయంతి కనిపించింది. 1910 ఫిబ్రవరిలో గురజాడ అప్పారావు గారి 'దిద్దుబాటు', అంతకుముందు వస్తున్న కథలకు భిన్నంగా, సంపూర్ణ ఆధునికతతో వచ్చింది. దానినే మొదటి ఆధునిక కథ- కథానికగా పరిశోధకులు ఎప్పుడో గుర్తించారు. దానిని అనుసరిస్తూ తర్వాత తర్వాత ఎన్నో కథానికలు వచ్చాయి, వస్తున్నాయి. తెలుగు సాహిత్యంలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ప్రక్రియ ఇది. సమాజాన్ని ఇది స్పృశించని కోణం లేదు. వచన రచన కాబట్టి అందరికీ అర్థమవుతుంది. క్లుప్తత ప్రధానం కాబట్టి చదవడానికి తక్కువ సమయం పడుతుంది. ఎక్కువమంది ఆదరించే ప్రక్రియ-కథానిక.
కాబట్టి కథానిక శతజయంతి పండగని వైభవంగా చేస్తే కథానిక పట్లే కాదు, తెలుగు సాహిత్యం పట్ల అభిరుచిని పెంపొందించవచ్చనే ఆశ కలిగింది.
ఆ ఆలోచన రావడమే ఆలశ్యం, కథానిక శతజయంతి పండగని చేసుకునే వాతావరణాన్ని రాష్ట్రవ్యాపితంగా కల్పించాలనే సంకల్పం కలిగింది. అంతే! కథానిక 99వ సంవత్సరంలోకి అడుగు పెట్టినప్పటినుంచి జిల్లా కథానికా సదస్సుల్ని ప్రారంభించి రాష్ట్రవ్యాపితంగా 23 జిల్లాలలోనూ వరుసగా శ్రీవేదగిరి కమ్యూనికేషన్స్ బానర్తో, జిల్లాలలోని స్థానిక సంస్థల సహకారంతో నిర్వహించాను.
ఆయా జిల్లాలలోని రచయిత(త్రు)లు, విమర్శకులు, సాహిత్యాభిమానులందరూ ఈ సదస్సులలో పాల్గొన్నారు. కథానికల గురించి విరివిగా చర్చలు సాగాయి. అంతటితో ఊరుకోకుండా ప్రతిజిల్లాలోనూ - ఆ జిల్లాలో వందేళ్ళ కథానిక విూద పోటీలు పెట్టాను. అలా పోటీలు పెట్టడం వల్ల చాలామంది ఆ జిల్లాల కథానికా పరిణామాన్ని ఆలోచిస్తారని ఆశ. వచ్చిన వాటిలో ఉత్తమ వ్యాసాల్ని ఎంపిక చేసి, ఒక్కోదానికి రూ.1,116/- బహుమతిగా ఇవ్వడమే కాకుండా, వాటన్నింటినీ కలిపి ఇప్పుడు సంకలనంగా తెస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఇది క్రొంగొత్త ప్రయోగం.
- వేదగిరి రాంబాబు
