-
-
తెలంగాణ విఫలాంధ్రప్రదేశ్
Telangana Viphalandhrapradesh
Author: H.Vageeshan
Publisher: Sakala Prachuranalu
Pages: 200Language: Telugu
హారతి వాగీశ్ రచించిన ' తెలంగాణ విఫలాంధ్రప్రదేశ్' అనే పుస్తకం తెలంగాణ ఉద్యమాల నేపధ్యంలో తెలుగువారి చరిత్ర, సంస్కృతి, రాజకీయాలకు సంబంధించిన అనేక అంశాల్ని హేతుబద్దంగా, వివరణాత్మకంగా వివరించింది. ఈ పుస్తకం తెలంగాణపై ఈ మధ్యకాలంలో వెలువడిన అవగాహన సాహిత్యంలో భాగమే అయినప్పటికి, దీనికి ఒక ప్రత్యేకతవుంది. అదేమంటే కేంద్రీకృత, ఆధిపత్య, పెత్తందారీ ధోరణిలో ఎదిగిన డెల్టాంధ్ర సీమ ప్రాంతనాయకత్వం, స్వార్థం, బానిసబుద్ధులు కల్గిన అగ్రకుల తెలంగాణ నాయకత్వం సమిష్టి కృషితో ఆంధ్రప్రదేశ్ ప్రయోగం ఏవిధంగా విఫలమైంది, దాని దుష్పరిణామాలు, దుష్ఫలితాల్ని కూలంకషంగా చర్చించడం. అంతేకాకుండ ఈ పుస్తకం ప్రస్తుత తెలంగాణ పరిస్థితిని విమర్శనాత్మకంగా పరిశీలించి భవిష్యత్ చిత్ర పటాన్ని రేఖామాత్రంగా సూచించింది.
'తెలంగాణ విఫలాంధ్రప్రదేశ్' నాల్గు భాగాలుగా విభజించబడి 20 అధ్యాయాల్ని కల్గివుంది. మొదటి భాగంలో క్రీ.శ. 1724, 1956 నాటి చారిత్రిక అంశాల్ని, రెండవ భాగంలో 'తెలుగుజాతి' అభివృద్ధిని తెలంగాణ దృక్పథంలో పరిశీలించి, నాయకత్వ వైఫల్యాలు, ప్రత్యామ్నాయాలకు సంబంధించిన విషయాల్ని మూడవ భాగంలో పొందుపరచం జరిగింది. నాలుగవ భాగంలో తెలంగాణ భవిష్యత్ చిత్ర పటాన్ని రేఖామాత్రంగా పరిచయం చేయడం జరిగింది. ఈ పుస్తకంలో అనుబంధాలు, చదువవల్సిన కొన్ని ముఖ్య పుస్తకాల, పత్రాల వివరణ సూచిని పొందుపర్చడం విశేషం.
విశాలాంధ్ర విఫల ప్రయోగానికి వివిధ రాజకీయ పార్టీలు ఏవిధంగా దోహదం చేశాయి అనే అంశాన్ని వివరణాత్మకంగా, సోదాహరణంగా వివరించడం ఈ పుస్తకానికున్న ప్రత్యేకత ఆకర్షణ. రచయిత తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ప్రజాస్వామికంగా, నిస్వార్థంగా, ప్రతిబింబించలేని నాయకత్వ సంక్షోభాన్ని వివరించాల్సిన ఆవశ్యకతను తెలియజేశాడు.
ఈ పుస్తకంలో వాగీశ్ విశ్లేషణ విమర్శనాత్మకంగానే కాకుండా, సామాజిక, రాజకీయ ఉద్యమాల స్వరూప, స్వభావాన్ని ఆధారాల సహితంగా బేరీజు వేశాడు. గతాన్ని, వర్తమానాన్ని విశ్లేషించి భవిష్యత్‌కు మార్గదర్శకాలను సూచించాడు. సాంఫిుక శాస్త్ర పరిశోధన, రనచల్లో యిది అరుదైన అంశం. కాని వాగీశ్ ఆ దిశగా ప్రయాణంచేసే బలమైన ప్రయోగం చేశాడని చెప్పక తప్పదు. ఆయన పరిశోధనా విధానం, పద్దతి తెలంగాణ యువ పరిశోధకులకు మార్గదర్శకం కావాలని ఆశిద్దాం. ఈ మధ్యకాలంలో తెలంగాణపై వచ్చిన సాహిత్యంలో ఈ పుస్తకానికి ప్రత్యేక స్థానాన్ని కల్పించిన వాగీశ్ అభినందనీయుడు.
- అడపా సత్యనారాయణ
