సిమ్లానుంచో, డార్జిలింగ్ నుంచో తెప్పించిన టీపొడికి, చంద్రమండలం నుంచి నేరుగా తెప్పించినట్టు బిల్డప్ ఇచ్చి, రకరకాల కాకమ్మ కథలు చెప్పి వ్యాపారం చేస్తూ వుంటాడు సుబేదార్ మార్కెట్ దగ్గర చాయ్ దుకాణాన్ని ఆపరేట్ చేసే గంగారాం మనిషి.
మెరికల్లాంటి అసిస్టెంట్లు వున్నారు అతని దగ్గిర. ఎప్పుడైతే షాడో సువేరా బిల్డింగ్‌లోకి ఎంటర్ అయ్యాడో, అప్పుడే ఏదోక ప్రాబ్లెమ్ ఎదురుపడవచ్చని ఊహించారు వాళ్ళు. నిమిషాలమీద పెద్ద టార్పాలిన్ని రెడీ చేశారు.
సర్కస్‌లలో ఎంతో ఎత్తునుంచి కిందికి దూకే ఆక్రోడెట్స్ కోసం ఉపయోగించే ట్రాంపోలిన్ మాదిరిగా పట్టుకుని రెడీగా నిలబడ్డారు.
గింగిరాలు తిరుగుతూపోయి దానిమీదే పడ్డాడు షాడో...కామోష్తో సహా. “రాజుకి ఏమీకాలేదు గాని, మతిపోయినంత పని అయిందిట కామోష్కి. తెలివితప్పి కళ్ళు తేలవేశాట్ట” జరిగింది ఏమిటో చెప్పింది బెట్టీ.
సిగార్ని మునిపళ్ళతో బిగించిపట్టుకుంటూ తల ఊపారు కులకర్ణి.
“ఇంతవరకూ బాగానే వుంది. వాట్ నెక్స్ట్?” అని అడిగారు.
“ఇంటరాగేషన్ మొదలు అవుతుందిట సర్. ఎత్తుకుపోయిన ఇన్ఫర్మేషన్ని తిరిగి మనం సంపాదించుకోవాలికదా” ఓపికగా చెప్పింది బెట్టీ.
“ఓ.కే... నాకు అన్ని వివరాలు తెలుస్తూండాలి. చిన్న డీటెయిల్ కూడా మిస్ అవకూడదు” అంటూ వెనుతిరిగి గదిలోకి వచ్చేశారు కులకర్ణి.
ఫైనల్ స్టేజీలో వున్నది సులోచన ఫోన్ సంభాషణ. “తప్పకుండా సర్... మాకు వివరాలు తెలిసిన మరుక్షణం మీకు ఫార్వార్డ్ చేస్తాము. తప్పకుండా చేస్తాము సర్. మీకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదు” అంటూ రిసీవర్ని ఫోన్‌మీద పెట్టి - ముఖంమీద ప్రత్యక్షం అయిన స్వేదబిందువుల్ని తన పమిటిచెంగుతో అద్దుకున్నది.
“ఎప్పుడూ లేనిది ఎందుకు ఇంతగా ఆత్రపడటం?” సిగార్ని తీసి యాష్‌ట్రేలో పడవేస్తూ తనలోతను అనుకుంటున్నట్టు పైకే అన్నారు కులకర్ణి.
“స్పెషల్ బ్రాంచివాళ్ళ ఒత్తిడి సర్. ఇది కామోష్ని మనం పట్టుకోవటంతో అగేటట్లు కనిపించటంలేదు. ఇంకేదో వున్నది” తన అభిప్రాయాన్ని వెల్లడించింది సులోచన.
కుషన్ ఛైర్ వెనక్కివాలి కనులు మూసుకున్నారు కులకర్ణి. ఆయన ఆలోచనల్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేదు సులోచనకి. టేబుల్ మీద పెట్టిన తన ఫైల్స్‌ని తీసుకుని మెత్తగా అడుగులేస్తూ గదిలోనుంచి బయటికి నడిచింది.
