-
-
తమసోమా జ్యోతిర్గమయ
Tamasoma Jyotirgamaya
Author: Dr. Bandi Satyanarayana
Publisher: Self Published on Kinige
Pages: 40Language: Telugu
దాదాపు పదునైదు పదునైన పుస్తక శరాలను సంధించి, సమాజా సమానతలను తుద ముట్టింప ప్రయత్నం చేస్తున్న వీరుడాయన. భాషపై మంచిపట్టు, భావాలపై మించిన అభినివేశము గల దిట్ట. ఆకాశవాణి వ్యాఖ్యానం ఆయన దైనందిన వ్యాసంగంగల డాక్టర్ బండి సత్యనారాయణగారు మృదు మధురముగా మాట్లాడి శ్రోతల యదగదులలో గిలిగింతలు పెట్టగల చెలికాడు. తమ కవితల “బండిని నల్లేరుపై నడిపినట్లుగానే పాఠకుణ్ణి పద్యాల నౌకలో కూర్చుండబెట్టి సమాజ సాగరంపై తేలియాడింపజేయగల నేర్పరియని ఈ 'తమసోమా జ్యోతిర్గమయ' చూచినపుడు అర్థమైనది.
102 పద్యాల సరిసంఖ్యను ఎన్నుకొని 51 ఆటవెలదులు, మరో 51 తేటగీతులను ఒకదానివెంట మరొకటిని పరుగులు పెట్టించారు. 'తమసోమా జ్యోతిర్గమయ' అనే శీర్షికతో 'పంచపది-విలక్షణ శతకము' అనే ఉపశీర్షికను ఉంచడం ఒక విలక్షణమైన క్రొత్త యెత్తుగడైతే, రెండు మకుటాలతో రెండు ఛందాలతో అటునిటు నడిపిన తీరు అనన్య సామాన్యమైన సవ్యసాచిత్వ సారూప్యము. తొలిపద్యం ఆటవెలది, మలి పద్యం తేటగీతి. 'విన్నవించుకొందు వినయంబుతోడను’ తొలి మకుటమైతే ‘నేను సెప్పెడి మాటలు నిజముగధర' మలి మకుటం. ఏకపద, ద్విపద, త్రిపద, బహుపద, ఏకపాద, ద్విపాద మకుటములతో ఎన్నో శతకాలు వెలసిన మన తెలుగు సాహితీవనంలో ఒకే కొమ్మకు రెండు రంగుల పువ్వులు విరిసినట్లు ఒకే శతకంలో రెండు మకుటాలుండడం నిజంగానే విలక్షణం. అది కూడా 'పంచపాది శతకం'.
ఇక విషయానికి వస్తే చాలా శతకాల మాదిగానే యిదికూడా ముక్తకాల కోవకు చెందినదే. ముక్తక రచనలో కవికి కావలసినంత స్వేచ్ఛ యుంటుంది. కారణం విషయ నియమం లేదు కాబట్టి. అమ్మా, నాన్నా, గురువూ, మిత్రుడు, దేవుడు, మతము, చదువు, సంస్కారము, రాజకీయము.. ఇలా సమాజాంతర్భాగాలైన అన్ని అంశాలను స్పృశిస్తూ, ఎడనెడ మూఢ నమ్మకాలను ఏమాత్రం మొహమాత్రం లేకుండా ఎండగడ్తూ అక్కడికీ లొంగని వాటిని తమ కల కరవాలముతో బంధించే ప్రయత్నము కూడా చేసారు. కృత కృత్యులైనారు కూడాను.
- శినారా
