-
-
తాళపత్ర విజ్ఞానం
Talapatra Vignanam
Author: Saili
Publisher: Victory Publishers
Pages: 769Language: Telugu
మహర్షులు తాళపత్రాలపై వ్రాసిన అనేకమైన సాంప్రదాయ ఆరోగ్య, జీవనరహస్య ధర్మసందేహాలకు సమాధానాల సంపుటి ఈ "తాళపత్ర విజ్ఞానం".
* * *
ప్ర. ఎప్పుడూ సంతోషంగా వుండడానికి దారి ఏది?
జ. అరటిపండు తొక్కమీద కాలువేసి జారి పడ్డారు ఎవరో. అంతా నవ్వారు. అదేచోట మీరు జారిపడ్డారు. బాధ పడతారు. ఒకటే చర్య. ఆనందం, దుఃఖం ఎవరి చేతుల్లో ఉన్నాయి? మీ చేతిలోనే కదా! మామూలుగా, మీ మనసులో సంతోషాన్నిచ్చే ఆలోచనల కన్నా, బాధనిచ్చేవే గుర్తుంటాయి. బాధ ఉన్న క్షణాల మళ్ళీ మళ్ళీ ఎందుకు నెమరు వేసుకుంటున్నారు? పనికి వెళ్ళినప్పుడు, కళాశాలలో పాఠాల బరువుతో కాలం గడిపిన రోజులు, కళాశాలలో వుంటే, బళ్ళో మాష్టారు దగ్గర దెబ్బలు తిన్న సంఘటనలు... ఎందుకు ఎప్పుడూ జరిగినదాన్నే ఆలోచిస్తూ ఈ క్షణాన్ని గుర్తించడం మర్చిపోతున్నారు. ఒక్కొక్కక్షణాన్ని గుర్తించి అనుభవించగలిగితే, ప్రతిక్షణం సంతోషమే కదా?
ప్ర. దేవుడొక్కడే అంటూ మళ్ళీ ముక్కోటి దేవతలు అంటారేం?
జ. ముక్కోటి ఆంధ్రులున్నప్పుడు అలా అనే వారు, ఇప్పుడు ఆరుకోట్ల దేవతలు.... ప్రతి ప్రాణీ పరమాత్మ స్వరూపం అన్న నమ్మకం దీనికి కారణం! అది లేని వారికి ఏ బాధాలేదు, ఇందరు దేవత లేమిటా అనే చింత తప్ప!
ప్ర. మంగళమంటే...?!
జ. ఆనందం, హుందాతనం కలిపిన పవిత్రమైన ఆనందాన్ని మంగళమనవచ్చు. ప్రతి చిన్న విషయానికి ఎదుటి వారిపై విరుచుకుని పడకుండా ప్రశాంతంగా వుండగలగడం. ప్రతివారికీ మంచి జరగాలని ఆశించడం. అమంగళకరమైన ఆలోచనలు, మాటలు రానీయకుండా వుండటం మంగళమని చెప్పవచ్చు. ఇలా వుంటే మన ఉనికి ఇతరులలో సంతోషాన్ని, ఒక పవిత్ర భావాన్ని రేకెత్తిస్తుంది. మనస్సులో అనవసరమైన భారాన్ని పెట్టుకోకుండా తేలికగా పని చేయడం అనాయాసమయితే, మనమెళ్ళిన చోటల్లా ఒక దీపంవలె ఆనందాన్ని ప్రసరింపజేయడం మంగళం.
ప్ర. దేవుని చూసిన మీదట తిరిగి వెళ్ళేటప్పుడు వెనుకకు తిరిగి చూడకూడదని కొందరంటారు. నిజమేనా?
జ. సౌకర్యం దృష్ట్యా ఈ మాట సరియైనదే కావచ్చు. దైవాన్ని దర్శించి ఆ మూర్తిని మన హృదయఫలకం మీద ముద్రించుకున్నాం. అది చెదరిపోకుండ నిలుపుకోవడం ముఖ్యం కనుక ఏకాగ్ర మనస్కులమై బయటకువచ్చి కొంతసేపు ధ్యాన నిమగ్నులం కావడం కోసం అలా చెప్పారు.
