-
-
స్వాభిమానం
Swabhimanam
Author: Ganti Bhanumathi
Publisher: Ganti Prachuranalu
Pages: 199Language: Telugu
భానుమతిగారి కథల్లో వస్తువైవిధ్యం అనంతంగా వుంది. కారణం, ఆమెకు మానవ సంబంధాల్లోని వైరుధ్యాలూ, మానవ స్వభావంలోని వైచిత్రి, మానవ ప్రవర్తనలోని విపర్యయాలూ - చాలా నిశితంగా తెలుసు. ఆమె కథల్లో సమాజనేపథ్యం - ఆకుచాటు పిందెలా వుంటుంది. సమాజానికీ మనిషికీ మధ్యనున్న ఘర్షణ- చాలా సున్నితంగా కథాత్మలో ప్రవేశించి ఆశ్చర్యపరుస్తుంది.
భానుమతిగారి కథల్లో స్త్రీ పురుష సంబంధాల్లోని అనుభూతి పూర్వకమైన అనిర్వచనీయత సత్యశివసుందర తాత్త్వికతతో ధ్వనిస్తుంది. దీనికి ఉదాహరణ 'సాహచర్యం' అనే కథ. ఈ కథలోని దంపతుల పాత్రల్నీ, వారి అనురాగానుబంధాన్నీ చదువుతున్నప్పుడు- ఈ రచయిత్రి మల్లాదివారినీ, శ్రీ రమణనీ గుర్తు చేస్తారు. సాంసారిక ప్రణయంలోని లౌకిక, అలౌకిక బంధాన్ని ఇలా అక్షరీకరించటం - ఒక గొప్ప 'ఎక్సలెన్స్'కి నిదర్శనం.
భానుమతిగారి కథాశిల్పంలో - ఎత్తుగడ, కథనం, ముగింపు-దేనికదే విశిష్టంగానూ, మూడింటి ఐక్యత విలక్షణంగానూ వున్నాయి. కొన్ని కథలు నేపథ్య చిత్రణతో, వాతావరణ చిత్రణతో ప్రారంభం కాగా, కొన్ని కథలు సరాసరి సంభాషణాత్మక కథనంతో కథాంశంలోకి ప్రవేశిస్తాయి. జీవితం నిరంతర స్రోతస్విని కనుక కొన్ని బతుకు కథలు చదువరి ఊహించుకునే ముగింపుని పొందవు. ఒక సంభవం, లేదా ఒక సంఘటన, లేదా ఒక పాత్ర చర్య యొక్క continueగా సాగిపోతాయి. ఇది వాస్తవికమైన ముగింపు లక్షణం.
భానుమతిగారి కథల్లోని పాత్రలు మనతో ఊసులాడుతూనే వుంటాయి. వారి సన్నివేశాలూ, వారి భావోద్వేగాలూ మనల్నీ, మన మననధారనీ కుదిపేస్తూనే వుంటాయి. అదీ ఆ కథల్లోని జీవశక్తి. చదివి ఆనందించమని కోరుతున్నాను.
- విహారి
