-
-
శ్రీమద్భగవద్గీత - మొదటి సంపుటం
Srimadbhagavadgita Volume 1
Author: Dr. Munjuluri Narasimharao
Publisher: Self Published on Kinige
Pages: 581Language: Telugu
భగవద్గీత మహాభారతనేపథ్యంలో రూపొందిన యోగశాస్త్రం. శ్రీకృష్ణద్వైపాయనుడి శిష్యుడు వైశంపాయనుడు పరీక్షిత్తు కొడుకైన జనమేజయుడికి మహాభారతాన్ని చెప్పడానికి ప్రారంభిస్తూ ‘ప్రవక్ష్యామి మతం కృత్స్నం వ్యాసస్యామితతేజసః’ అనీనూ ‘సత్యవత్యాత్మజేనేహ వ్యాఖ్యాతమమితతేజసా’అనీను చెప్పి, ఇది వట్టి చరిత్ర మాత్రమే కాదన్న మాటను ఒత్తి చెప్పాడు. వ్యాసమహర్షి ఈ ఇతిహాసాన్ని మననం చేసి, బాగా ఆలోచించి, తాను నిష్కర్షించిన పరమార్థాన్ని దానికి వ్యాఖ్యానంగా రాశాడు.
చరిత్రను వ్యాఖ్యానం చేయడంగానీ, దానిమీద తన అభిప్రాయాన్ని చెప్పడాన్నిగానీ నిజానికి ఎవరికీ కుదరదు. ఇతిహాసమనేమాటకు ‘ఇతి` హ`ఆస’ `ఇలాగ ప్రసిద్ధమై ఉన్నది అని మాత్రమే అర్థం. ఇలాగ జరిగి ఉన్నదానికి ‘అలాగ జరిగిందిట’ అని చెప్పడం తప్ప మరేమీ చేయలేం. మన అభిప్రాయాలూ మన ఆలోచనలూ తోడుచేసినా ఏమిలాభం వస్తుంది? ఆ చరిత్రను ఏవిధంగానూ మనం మార్చలేం. ఇక్కడ వ్యాసమహర్షి వట్టి ఇతిహాసాన్నే చెప్పడంలేదని అందుకోసమనే చెబుతున్నాం. ఆ చరిత్రను ఆధారంగా చేసుకొని పరమార్థాన్ని చెప్పాడాయన. ఆయన వ్యాఖ్యానసారమే వెన్నలాగ భీష్మపర్వంలో భగవద్గీతగా పేరుకొంది. చరిత్ర అనే మూసలో భగవద్యోగ విధానాన్ని, అంటే, భగవంతుణ్ణి కలుసుకొనే విధానాన్ని వివరించాడు వ్యాసుడు.
అధ్యాయాలను ఆరారు చొప్పున మూడు భాగాలుగా చేయడం కద్దు. కర్మ, ఉపాసన, జ్ఞానం అని ఆ భాగాలకు పేర్లు పెడుతూ ఉంటారు. కానీ ప్రతి అధ్యాయంలోనూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేవుడికి దగ్గరగా కూర్చొని తెలివిగా కర్మను చేయాలని చెబుతూనే ఉంటాడు శ్రీకృష్ణుడు. అందుకని అటువంటి కచ్చితమైన భాగాలు ఉన్నాయని మనం చెప్పడానికి వీలు ఉండదు. ఉపాసన అంటే బాగా దగ్గరగా కూర్చోడం. అప్పుడు ఆ భగవత్కర్మను చేసేటప్పుడు తిండీతిప్పల గురించి గుర్తులు ఉండని స్థితి కలుగుతుంది. ఆ విధంగా భగవంతుడిలో మునిగి పనిని చేస్తూ ఉంటే కలిగే భక్తి పేరే ‘స్వస్వరూపావస్థితి’, అంటే, సొంతరూపమైన ఆత్మలో నిలిచి ఉండడం. ఆ భక్తే జ్ఞానం. పొందవలసినది అదే.
ఈ మొదటి భాగంలో ఆరు అధ్యాయాలున్నాయి.
భగవద్గీతను వివరించగలిగే స్తోమత లేకపోయినా, కాళిదాసు అన్నట్టు, యోగీశ్వరులైన లాహిరీ మహాశయులు చెప్పిన అర్థాన్ని తెలుగులోకపు సాధకులకు కూడా చేరవెయ్యాలనే చాపల్యమే ఈ వివరణను మొదలుపెట్టడానికి సాహసింపజేసింది. పెద్దలూ విజ్ఞులూ ఈ ప్రయత్నాన్నిసానుభూతితో సమీక్షిస్తారని నమ్ముతున్నాను. ఎంత కష్టపడి ఎన్నిసార్లు దిద్దుబాట్లు చేసినా ఏవో తప్పులూ లొసుగులూ ఉండడానికి ఆస్కారం లేకపోలేదు. వాటిని పెద్ద మనస్సుతో పెద్దలు నాదృష్టికి తెస్తే కృతజ్ఞతతో దిద్దుకొంటాను.
- డా॥ ముంజులూరి నరసింహారావు
