-
-
శ్రీమద్భగవద్గీత
Srimadbhagavadgeeta
Author: Lakkakula Subbarao
Publisher: Victory Publishers
Pages: 1038Language: Telugu
భగవద్గీతకు సరళ భావార్థంతో వ్యాఖ్యాన సహితముగా అందుస్తున్నారు శ్రీ లక్కాకుల సుబ్బారావుగారు.
శ్రీమద్భగవద్గీత - శ్రీ నిలయుడు - శ్రీమంతుడు - శ్రీనివాసుడు - శ్రీకృష్ణుడు సంపూర్ణ అవతారస్వరూపుడు శ్రీమన్నారాయణుడు లోకహితంకోసం విశ్వశ్రేయస్సును కాంక్షించి, హృదయంగమంగా చేసిన అద్భుతగానం అమృత గానం, అమర గానం, శాశ్వతసుధారసైక గానం, ఆత్మసాక్షాత్కార గానం!
అందులో వేదాల సారముంది. ఉపనిషత్తులు ప్రతిపాదించిన జ్ఞానమున్నది. కర్తవ్య నిర్వహణ ప్రబోధమున్నది. అనన్యభక్తి ఉన్నది. సర్వోత్తమ భావాలకు ఆకారమైయున్నది. సాక్షాత్తు పరమేశ్వరుని అవతారమైన శ్రీకృష్ణుడు - కుంతీకుమారుడగు పార్థునికి ఉపదేశించబడింది యీ గీతాగానం.
పరమాత్మ ముఖకమలంనుండి వెలువడిన అమృతగానమే - భగవద్గీత. భగవద్గీత - శ్రీకృష్ణ ఉవాచగా కాకుండా, భగవానువాచగా, ప్రసిద్ధికెక్కింది. ఇది మహాభారతాంతర్గతం కావటం చేత భారతానికి అంతరాత్మగా పెద్దలు ప్రవచించారు. భారత రచనాకాలం క్రీ.పూ. సుమారు 5000 సంవత్సరాలుగా, చారిత్రక పరిశోధకులు నిర్ణయించారు. అప్పటినుండి నేటివరకూ గీతాగానం - యోగులకు, జ్ఞానులకు, భక్తులకు ఒకరేమిటి, సామాన్య మానవులకందరకూ, స్ఫూర్తిదాయకము, జ్ఞాన ప్రదాయకముగా వెలుగులు వెదజల్లుచున్నది. గీత అన్ని భాషలలోనికి అనువదించబడటం చేత, సమస్త ప్రజల ఆధ్యాత్మిక జీవనానికి ప్రామాణిక గ్రంథంగా భావించబడుచున్నది.
గీతం అనగా గేయం. భగవద్గీతయనగా భగవానుని చేత స్వయంగా, గానం చేయబడింది. భగవానుడు జ్ఞానస్వరూపుడు. అందుచేత ఆయన భగవద్గీత ద్వారా లోకానికి అందించినది - ఆత్మజ్ఞానమనే అమూల్యరత్నభాండగారం.
అదొక జ్ఞానసాగరం. వేదాలలో కర్మకాండ, ఉపాసనాకాండ అలాగే జ్ఞానకాండ చెప్పబడినాయి. జ్ఞానకాండమే ఉపనిషత్తులుగా వేదాంతంగా పెద్దలు చెబుతారు. ఉపనిషత్తుల సారమే - గీతాగానం అని, పెద్దల ఉవాచ.
