-
-
శ్రీ యాదగిరి క్షేత్ర వైభవం
Sri Yadagiri Kshetra Vaibhavam
Author: rayasam lakshmi
Publisher: Self Published on Kinige
Pages: 85Language: Telugu
యాదగిరి క్షేత్ర వైభవాన్ని శ్రీమతి రాయసం లక్ష్మి సరళసుందరంగా, పఠనీయ శైలిలో మనకందించారు. ఇందులోని పురాణ ప్రశస్తి జగద్విఖ్యాత చరిత్రే. వ్యాసమహర్షి శ్రీమత్ భాగవతంలో ప్రతిపాదించిన భక్తి వేదాంతాలు రంగరించుకొన్న శ్రీ నృసింహ ప్రహ్లాద చరిత్రే అది. ఆ తర్వాత క్షేత్ర వైభవంలో శాంతా ఋష్యశృంగుల పుత్రుడైన 'యాద' తపస్సు చేయడం, ఆంజనేయుడు తోడుగా ఉండడం, లక్ష్మీనారాయణులు మాట్లాడుకోవడం, వారు 'యాద' ను కరుణించడం భక్తుడు కోరిన విధంగా ఆ గిరి కుహరంలో నివసించడం, అర్చారూపంలో మారి అనుగ్రహించం అన్ని వివరించారు. ఈ విధంగా కథాకథనం ద్వారా ప్రశ్నోత్తర పద్ధతిలో రచయిత్రి యాదగిరి క్షేత్ర నామవైశిష్ట్యాన్ని, భగవంతుని అవతారాన్ని శ్రీమన్నారాయణమూర్తి అక్కడ అవతరించన్ని కళ్లకు కట్టినట్లు చిత్రించారు. తాతామనుమల మధ్యన జరిగే ఈ సంభాషణ ఉపనిషత్తులలోని గురుశిష్యుల ప్రశ్నోత్తోర పరంపరను అనుసరించింది.
ఆ తర్వాత శ్రీయాదగిరి నృసింహస్వామిపై వచ్చిన సాహిత్య సంపదను రచయిత్రి క్రోడీకరించారు. క్షేత్ర మాహాత్మ్యాలు, శతకాలు, క్లుప్తంగా అందించే ప్రయత్నం చేశారు. ఈ విషయాలన్నీ పరిశోధకులకు పాథేయంగా ఉపకరిస్తాయి. ఆ తర్వాత యాదగిరి క్షేత్రంలోని విష్ణుకుండాన్ని గురించి, ఇంకా ఇంకా ఇతర విషయాలను స్థానిక చరిత్రలాధారంగా నిరూపించే ప్రయత్నం చేశారు. బ్రహ్మకుండం, శివకుండం, సుదర్శన చక్రం, సమీపంలోనే వెలసిన పాత లక్ష్మీనరసింహక్షేత్రం తదితర విశేషాలను సోదాహరణంగా వివరించారు.
ఆ తర్వాత క్షేత్రానికి సంబంధించిన చారిత్రక ఆధారాలను మరొక శీర్షిక కింద ప్రస్తావించారు. దేవదాయ ధర్మదాయ శాఖలవారి చట్టాల వరకు చారిత్రక విషయాలను వివరించారు. చివరలో నిత్య పూజలకు సంబంధించిన సుప్రభాతాది అనేక సేవలను సంక్షిప్తంగా ప్రస్తావించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో నిత్య కల్యాణం పచ్చతోరణమే. అదేవిధంగా యాదగిరిక్షేత్రంలో కూడ నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సోరోత్సవాలున్నట్లు ఈ చిన్ని గ్రంథం వల్ల అందరికీ తెలిసే అవకాశం కల్పించారు.
ముక్తాయింపుగా ధర్మ ప్రచార కార్యక్రమాలను వివరించారు, నిత్యాన్నదానం, వైద్యసహాయం, విద్యావికాసం, ఆరోగ్య శిబిరాలు, జీవనోపాధి తదితర విశేషాలను వివరించారు. మానవ సేవే మాధవ సేవ సూక్తిని హిందూధర్మం పాటిస్తుందని మన దేవాలయం మానవతా వికాస కేంద్రమని, మానవుడు దివ్య మానవుడు కావడనికి దోహదం చేసే విధంగా మన దేవాలయాలున్నాయని భావించడానికి వీలుగా ధర్మ ప్రచార కార్యక్రమాలను కూడ గ్రంథం చివరన చేర్చడం ఈ గ్రంథానికి వన్నె తెచ్చిన అంశమే కాకుండ, అందరికీ ఒక మంచి సందేశాన్ని అందించినట్లు అయింది.
- ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి
