“దారి మధ్యలో కారును ఆపే ప్రయత్నం జరిగిందట గదా....” భాను వంక పరీక్షగా చూస్తూ అడిగాడు దినేష్.
ఆ కంఠంలో అనవసరంగా ప్రతిధ్వనిస్తున్న అహంకారాన్ని గమనించి నొసలు విరుస్తూ తల వూపాడు భాను.
“డాడీ దగ్గిర హెవీ ఎమౌంట్ వున్నదని ఎవరికీ తెలిసే అవకాశం లేదు... ఆ విషయం గురించి తెలిసిన వాళ్లలో నువొక్కడివే బయటివాడివి.....” అలాగే చూస్తూ అన్నాడు దినేష్.
ఆ మాటల్లో విపరీతార్ధం గోచరించి కొంచెం షాక్ తిన్నాడు భాను.
“మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావటం లేదు...” తన ముఖంలోని భావాలు బయటికి కనిపించకుండా వుండటానికి ప్రయత్నం చేస్తూ అన్నాడు.
“పట్టుబడకుండా తప్పించుకున్న వాళ్ళందరూ అనే మాటే అది... డాడీ కేష్ని తీసుకు వస్తున్నట్లు వాళ్ళను ఎదిరించినట్లే ఎదిరించి డాడీకి నమ్మకస్తుడి మాదిరి ఫోజు పెడుతున్నాడు.....” తడుముకోకుండా, ఎక్కువగా ఆలోచించను కూడా ఆలోచించకుండా ఆరోపించాడు దినేష్.
లాగిపెట్టి అతని నోటి మీద కొట్టాలనే కోరికను బలవంతంగా అణుచుకుంటూ “నేనే ఆ పని చేయించినట్లయితే, కేష్ ఇంకా మీ డాడీ దగ్గిర ఎందుకుంటుంది?” అని అడిగాడు భాను.
