-
-
సౌందర్య లహరి
Soundarya Lahari
Author: J. Venkateswara Rao
Publisher: J. Venkateswara Rao
Pages: 56Language: Telugu
సౌందర్య లహరి - దేవి సౌందర్య మహిమల వర్ణనతోపాటు మంత్రతంత్ర శాస్త్ర రహస్యములు నిక్షిప్తం చేసికొన్న గొప్ప స్తోత్ర గ్రంథం. మధురకవి శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారి ‘పన్నీటి జల్లు’ అనే ఖండ కావ్యాల సంపుటిలో (1966) సౌందర్యలహరి అనువాద పద్యాలు చదివాను. శ్రీ కాటూరి వారు సహజంగా కవి గనుక వారి కవిత్వానికి అనుగుణమైన శ్లోకములను అనువదించారు - 57 మాత్రమే. అవి అందమైన తెలుగు పలుకుబడితో ఉన్నవి. (వారిదే ‘దేవ్యపరాధ క్షమాపణస్తోత్రం’ అనువాద పద్యాలు కూడ చివరిలో కలిపాను) నవ్యకవిత్వానికి ఆద్యులైన శ్రీరాయప్రోలు సుబ్బారావుగారు కూడ 27 శ్లోకాలకు పద్యానువాదం (‘వనమాలి’ ఖండ కావ్య సంపుటి 1947) చేసారు. గొప్ప కవులుగా ప్రసిద్ధి పొందిన వారి అనువాదాలు విశిష్టంగానే ఉంటవి గదా! 20 శ్లోకాలకు ఇద్దరూ అనువాద పద్యాలు వ్రాసారు.
ఈ పుస్తకం ప్రచురించటంలో నా ఉద్దేశం - ఏవో సంపుటాలలో చిక్కుకు పోయిన శ్రీ రాయప్రోలు, శ్రీ కాటూరి సౌందర్యలహరి పద్యాలను పాఠకులకు అందించటం. ఈ ఇద్దరివి లేనివి 36 శ్లోకాలు. వాటికి నాకు దొరికిన ఇతర కవుల అనువాదాల (24) నుండి ఒకటి నుండి మూడు వరకు ఉదహరించాను. వారందరు వంద శ్లోకాలకు అనుసరణలను వ్రాసారు.
అనువాదకులందరు భక్తిశ్రద్ధలతో చేసినవారే. మొదటి అనువాదం శ్రీ మద్దూరి సాంబయ్య కవి గారిది (1938) అని ఉపోద్ఘాతము వ్రాసిన వారు చెప్పారు. వారిది గుంటూరు జిల్లా - పరుచూరు అని అట్ట మీద ఉన్నది.శతావధానులు బ్రహ్మశ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారు యీ అనువాదాన్ని చూచి ఆమోదిస్తూ వ్రాసారు.
మరొక్కరిని గురించి రెండు మాటలు- వారు శ్రీ అమరవాది నీలకంఠయజ్వ సిద్ధాంతి, అష్టావధానులు. వారు కైలాసవాసి అయిన తరువాత వారి అనువాదం 1968లో ‘తిరువూరులో ముద్రణయింది. సౌందర్య లహరికి ముందు పదహారు పద్యాలు శంకర యతీంద్రుల గురించి; ఇష్టదేవతా ప్రార్థనగా ఒకటి, గ్రంథావతరణముగా రెండు పద్యాలు వ్రాసారు. కమనీయంగా ఉన్నవి. వాటిలో తొమ్మిది పద్యాలను మొదట్లో ఆముఖము వలె చేర్చాను.అనువాదకులందరికి నా వందన శతములు.
- జె. వెంకటేశ్వర రావు
