-
-
శిథిలాలయంలో శివుడు
Sithilalayamlo Sivudu
Author: Koduru Sri Venkateswara Swamy
Publisher: Koduru Prachuranalu
Pages: 200Language: Telugu
కళ అనేది దైవ ప్రసాదితం. సమాజపు లోతుల్ని స్పృశించి, మెదడులో నిక్షిప్తమైన భావాల్ని మధించి, మానస సరోవరంలోని కలువలవంటి అధ్బుతమైన కథలని జనబాహుళ్యంలోకి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం, పూర్వజన్మ సుకృతం కావాలి. అటువంటి సుకృతాన్ని తాతతండ్రుల నుంచి వారసత్వంగా అందిపుచ్చుకుని, దానికి తన సృజనాత్మకతను జోడించి, కావ్యకళా కన్యను రసజ్ఞుల హృదయాలకు పరిచయం చేయడంలో కృతకృత్యులైన నా శ్రీవారికి కళాభివందనములు. వారి జీవిత భాగస్వామిగా నా ఈ ఆత్మీయ వాక్యాల్ని మీ ముందుంచుతున్నాను.
సమాజ రీతులకు, మానవ సంబంధాలకు అద్దం పట్టే ఆయన రచనలలో ఎక్కడా మనకు తెలియని ఊహా ప్రపంచం, విపరీత పోకడలు కనబడవు. అది వారి తల్లిదండ్రుల నుంచి వారు అందుకున్న సంస్కారవంతమైన జీవన శైలికి నిదర్శనం. వారి కథలు చదివిన తరువాత, ఆయన అభ్యుదయవాదా లేక పాతతరం వాసనలుగల వ్యక్తా అని అనుమానం రాకమానదు. కానీ, ఆదర్శవంతమైన జీవన శైలిని అభ్యుదయ వాదంతో మేళవించి శృతి తప్పని జీవనశైలిని మనకు పరిచయం చేస్తాయి వారి రచనలు. మనిషి ఎంత అభ్యుదయవాదైనా, జీవిత కట్టుబాట్లు, సంప్రదాయ విలువలు అనే లక్ష్మణ రేఖను దాటితే మనిషి పతనం ఖాయం అనే సందేశం వారి రచనలలో నాకు నచ్చిన అంశం. చిన్న వయసులోనే వారు సాధించిన మానసిక పరిపక్వత వారి రచనలలో స్పష్టంగా కనిపిస్తుంది.
'శిథిలాలయంలో శివుడు' కథలో రాజేశ్వరి పాత్ర ద్వారా తప్పటడుగు వేసిన స్త్రీమూర్తిని కూడా సహృదయతతో అర్థం చేసుకుని, తప్పు మనసుది తప్ప మనిషిది కాదనీ, తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడితే, శిథిలమైన శరీరాలయంలో కూడా శివుడు జ్యోతి రూపంలో వెలుగుతునే ఉంటాడనే సందేశం ఆయన మహోన్నత భావజాలాన్ని మనకు పరిచయం చేస్తుంది. రాగద్వేషాలను జయించిన, స్వచ్ఛమైన శరీరకాంక్ష లేని ఆత్మ స్వరూపమైన ప్రేమను సావేరి పాత్ర ద్వారా రాగద్వేషాలతో నిండిన ప్రస్తుత సమాజానికి ఒక మార్గదర్శకత్వాన్ని అందించాలనే వారి ప్రయత్నానికి హృదయపూర్వక నమస్సుమాంజలి. ఇలా ప్రతి కథలోనూ వారు పొందుపరిచిన మానవ సంబంధాలు, వాటి విలువలు అనితరసాధ్యం.
- కోడూరు శ్రీజానకి
