-
-
సిరికాకొలను చిన్నది
Sirikakolanu Chinnadi
Author: Dr. Veturi Sundara Ramamurthy
Publisher: Veturi Sahiti Samithi
Pages: 97Language: Telugu
ఇది రాయలనాటి తెలుగునాటి సంస్కృతీ, ప్రజా జీవన ధోరణీ ప్రతిబించించే కథ. స్థలం కృష్ణానదీ తీరస్థమై ఆంధ్రవిష్ణు క్షేత్రంగా చరిత్రలో వాసికెక్కిన శ్రీకాకుళం.
ఆ ఊళ్ళో ప్రతి వైకుంఠ ఏకాదశికి తిరునాళ్ళు - కాముని పున్నమ అనీ దవన పున్నమ అనీ ప్రసిద్ధి గాంచిన శృంగార రాత్రికి నటవిటరసిక జన సందోహమంతా తరలివచ్చి తనివితీరా పొరలి వెళ్లే పొతుగడ్డ. అక్కడొక సానివాడ. అందొక రంగాజమ్మ.
ఆమె వయసు మళ్ళిన వాడ వదిన - ఆమెకు అందాలరాశి, భక్తికి వారాశి అయిన అలివేణి గారాల కూతురు. కళలూ, కావ్యాలూ అన్నీ నేర్చిన చిరుజాణ, మువ్వను కవ్వించడం, మువ్వగోపాలును నవ్వించడం ఆమె ఇష్టక్రియ. ఆమెకొక అక్క, పేరు చంచల. పరమ కర్మిష్ఠులనైనా పాదక్రాంతులను చేసుకొనగల కులవృత్తి విద్యాకిరణదృగంచల. మరో చిట్టి చిలక పాప - పేరు జలజ, ముక్కు పచ్చలారుతున్నా అక్క అలివేణి దిక్కుగా వుండి ఆమెనీ, ఆమె భక్తినీ ఆరాధిస్తూ, అనుసరిస్తూ వుండే సిరిమల్లి.
శ్రీకృష్ణదేవరాయలు కళింగదేశ విజిగీషా మనీషతో ఉత్తరాపథ జైత్రయాత్రకు వెడుతూ విజయవాడలో విడిది చేసిన రాత్రి. చేరువలో ఉన్న శ్రీకాకుళస్వామిని దర్శించాలనే సంకల్పం కలగడమూ, ఆ మరునాడు యాధృచ్ఛికంగా వైకుంఠ ఏకాదశి కావడమూ, తన వెంటవున్న ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన్న గారితో సహా కదలి అక్కడికి వెళ్లడమూ, ఆ సుమూహూర్తానే గజ్జెపూజ చేసిన్ నాట్యం చేయబోతున్న అలివేణిని చూడటమూ, ఆమె భక్తి తత్పరతకు మెచ్చి దేవదాసిగా జీవితం గడపాలనే ఆమె అభీష్టానుగుణంగా దేవదాసీత్వం విధించడమూ విటభుజంగాలకు విపణిమణిగా చేయాలనుకున్న రంగాజీ తలపు తలక్రిందులై దేవవేశ్యా భుజంగుడైన శ్రీకాకుళస్వామికి చెలిగా కన్న కూతురు బలికావటమూ క్షణంలో జరిగిపోతాయి. అక్కడి నుండి సంఘర్షణ, అదే ఈ కథ.
ఈ గాథ వైకుంఠ ఏకాదశి పరవడి తిరునాళ్లతో, అలివేణి నాట్య మంటపానికి చేరడంతో ప్రారంభమౌతుంది. ఈ దృశ్య కావ్యంలో భక్తి శృంగారం ఆత్మ. ఆస్తికతా పునరుద్ధరణ మహాయజ్ఞంలో అలివేణి సమిధ.
ఆ హవిస్సులు మీరూ రసజ్ఞులై ఆఘ్రాణించండి. దివ్యభక్తి వేదాంత గహనాంతరాలలో విహరించండి.
