-
-
సిప్రాలి
Siprali
Author: Sri Sri
Publisher: Vanguri Foundation of America
Pages: 95Language: Telugu
మహాకవి శ్రీశ్రీ 1981లో అమెరికా సందర్శించినప్పుడు హ్యూస్టన్లో శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారింట బస చేసిన సందర్భంగా తన స్వదస్తూరితో వ్రాసిన పుస్తకం సిప్రాలి. ఈ కవితలన్నీ 1945-1950 మధ్య కాలంలో రచించినవి. వివిధ పత్రికల్లో అచ్చయినవి. శ్రీశ్రీ గారి చేతి రాతతో ఉన్న ఈ పుస్తకాన్ని 1981లో మొదటిసారిగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 50 కాపీలు ముద్రించారు. అమెరికాలో ప్రచురితమైన తొలి తెలుగు పుస్తకం ఇది. శ్రీశ్రీగారి శతజయంతి సందర్బంగా 2009లో సరోజా శ్రీశ్రీ, వంగూరి చిట్టెన్ రాజు గార్ల ముందుమాటలతో పునఃప్రచురితమైంది. ఈ పుస్తకం గురించి శ్రీ వంగురి చిట్టెన్ రాజు గారి మాటల్లో:
* * *
"మీరు అమెరికాలో అడుగుపెట్టడం ఒక చారిత్రాత్మకమైన ఘట్టం కదా! దానికి గుర్తింపుగా, మీరు ఏదైనా తెలుగు సాహిత్య ప్రపంచంలో కలకాలం నిలబడిపోయే ఒక విశిష్టమైన రచన చేస్తే బావుంటుందని నా అభిప్రాయం, నా కోరిక" అన్నాను. ఆ ఐడియా వెంటనే ఆయనకి నచ్చిపోయింది. అమెరికా రాగానే మొన్న పిట్స్బర్గ్ వెళ్ళినప్పుడు ఒక గేయం వ్రాసాను కదా అన్నారు శ్రీశ్రీ సాలోచనగానే. అదొక్కటీ చాలదని సరోజగారికి, నాకూ కూడా అనిపించింది. కాస్సేపు తర్జన, భర్జనలు జరిగాక "నేను గత యాభై ఏళ్ళుగా అప్పుడప్పుడూ వ్రాస్తూ మూడు శతకాలు పూర్తి చేశాను. ఆ పద్యాలు పత్రికలలో అక్కడక్కడా పడ్డాయి కానీ అన్నీ కలిపి ఒక పుస్తకంగా ఇప్పటిదాకా రాలేదు" అన్నారు మళ్ళీ శ్రీశ్రీగారు ఒక విధమైన స్పష్టత తోటి. నాకూ, గిరిజకీ, సరోజ గారికి ఆ ఆలోచన బాగా నచ్చింది. "మరి ఆ పద్యాలన్నీ ఎక్కడ ఉన్నాయి సార్’ అని అడిగాను అమాయకంగానూ, అనుమానంగానూ. "ఇంకెక్కడుంటాయ్ రాజు గారూ, కొన్ని మా సరోజ పెట్లోనూ, చాలా మటుకు ఇక్కడ ఈ పెట్లోనూ" అని తన మెదడు కేసి చూపించారు నవ్వుతూ! అప్పటికప్పుడు నాకున్న అవగాహనతో రాత్రి రెండు గంటలకి ఆ పుస్తకానికి రూపకల్పన చేయడం జరిగింది. మొత్తం పుస్తకం అంతా శ్రీశ్రీ గారి చేతి వ్రాతలోనే ఉండాలని ఏకగ్రీవంగా నిశ్చయించుకున్నాం. అంతే!
ఆ మర్నాడు, జూన్ 10వ తారీఖున పొద్దుట 7 గంటలకు శ్రీశ్రీ గారు బల్ల దగ్గర కూర్చున్నారు. రాత్రి ఎనిమిది వరకూ దీక్షతో పని చేశారు. నేనూ, మా ఆవిడా ఆయన్ని చూసి కంగారు పడుతూ ఉంటే, "ఆయనకి అలవాటే" అని సరోజగారు మాకు ధైర్యం చెప్పారు. మా బలవంతం మీద తప్పనిసరిగా కొన్ని క్షణాలు తప్పించి, 114 'సిరిసిరి మువ్వలు' పద్యాలు, 103 'ప్రాస క్రీడలు', 100 'లిమరిక్కులు' కలసి "సిప్రాలి" కావ్యం తయారైంది. అన్ని పద్యాలూ తన స్వదస్తూరీతో సమకూర్చిన శ్రీశ్రీగారు, అవి నా చేతిలో పెడుతూ, "ఇదిగో, కవర్ మీద "సిప్రాలి" అనే టైటిల్ నీ చేతి వ్రాతలో ఉండాలి" అని నిర్దేశించారు.
శ్రీశ్రీగారి అర్థ శతాబ్దపు కోరిక హ్యూస్టన్లో నెరవేరడం వలన హ్యూస్టన్కి తెలుగు సాహిత్య చరిత్రలో ఒక స్థానం లభించింది. వ్యక్తిగతంగా, నా జన్మ ధన్యమయింది.
.......
ఆనాడు మహాకవి శ్రీశ్రీగారు ఇచ్చిన "సిప్రాలి" వ్రాత ప్రతిని అపురూపంగా దాచుకుని, సరోజా శ్రీశ్రీగారు స్వహస్తాలలో వ్రాసిన ముందుమాటతో, వారి కుమారుడు వెంకట రమణ గారి అనుమతితో, శ్రీశ్రీగారి శత జయంతి సందర్భంగా ప్రచురించడం మాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది.
ఈ "సిప్రాలి" వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 40వ ప్రచురణ. ఎంతో విశిష్టత, ప్రాముఖ్యత కలిగిన ప్రచురణ.
- వంగురి చిట్టెన్ రాజు
గమనిక: ఇది శ్రీశ్రీగారు తన చేతి రాతతో రాసిన పుస్తకం. చేతిరాతని స్కాన్ చేసి పుస్తకంగా డిజైన్ చేసారు. కాబట్టి ఈ పుస్తకం లుక్ అండ్ ఫీల్ మిగతా కినిగె ఈ-బుక్స్కు భిన్నంగా ఉంటుంది, గమనించగలరు. "సిప్రాలి" ఈబుక్ సైజు 8.96 mb
