"వెల్ మిస్టర్ షాడో... దిసీజ్ లైక్ దిస్....." అంటూ సిగార్ ఏష్ ట్రేలో కుక్కి టేబిల్ మీదకు వంగాడు కాప్టెన్. "బహుశా సిల్వర్ కింగ్ విషయం నీకు తెలిసే వుంటుంది. మొట్టమొదటి సారిగా ఇండియాలో తయారు చేయబడిన ఏకైక సబ్ మెరీన్. గడిచిన యుద్ధాల్లో నావీ నిర్వహించిన పాత్రను గమనించి, ప్రభుత్వం నావికాదళాన్ని మరింత శక్తివంతం చెయ్యటానికి వేసిన ప్రణాళికల ఫలితం సిల్వర్ కింగ్. సోవియట్ ప్రభుత్వ సాంకేతిక సహకారంతో, అధునాతమైన యంత్రాలతో తయారు చేయబడింది. దాని ధాటికి అటమిక్ సబ్ మెరీన్లు గూడా తట్టుకోలేవనే వదంతి బయలు దేరింది. ఎంత రహస్యంగా వుంచుదామని ప్రయత్నించినా, వివరాలు బయటికి పొక్కాయి. మన శత్రువులు సిల్వర్ కింగ్ మీద ఒక కన్ను వేసి వుంచారు. వీలైతే దాన్ని నిర్మాణావస్థలోనే నాశనం చెయ్యాలని ప్లాను వేశారు. కాని మా ఇంటలిజెన్స్ విభాగం వారి ప్రయత్నాలను విఫలం చేసింది. రెండు నెలల క్రితం సిల్వర్ కింగ్ జల ప్రవేశం చేసింది. దాని మాక్సిమమ్ కెపాసిటీ చూడటం కోసం, ఎవరికీ చెందని హిందూ మహాసముద్ర జలాల్లో లాంగ్ టూర్స్ చేయటం కోసం పంపారు. సరిగ్గా నెల రోజులక్రితం అనుకోని పరిణామం ఒకటి సంభవించింది......" అంటూ ఇంకో సిగార్ వెలిగించుకోనికి ఆగాడు.
"సిల్వర్ కింగ్‌లో యంత్రాలన్నీ ఆటోమాటిక్‌గా పని చేస్తాయి. వాటిని ఒక కంప్యూటర్ కంట్రోల్ చేస్తుంది. వున్నట్లుండి ఒక రోజు కంప్యూటర్లో ఒక భాగం చెడిపోయింది. అది అన్నిటికీ ముఖ్యమైన కంట్రోలింగ్ ప్లేస్. దాని వల్ల సిల్వర్ కింగ్ గమనానికి ప్రమాదం ఏర్పడింది. టూర్ ఆపి ఒక చోట నీటిలో దాక్కుంది. ఆ విషయం మన శత్రువులకు కూడా తెలిసింది."
"అయితే సిల్వర్ కింగ్ ప్రమాదంలో పడిందన్నమాట. అది ఎక్కడ వుందో తెలిస్తే టార్సెడోలను ప్రయోగించో, బాంబులు వేసో నాశనం చెయ్యకమానరు" తన అభిప్రాయం వెల్లడించాడు షాడో.
